 
                                        ‘కుక్కపిల్లా...సబ్బుబిళ్ళా...అగ్గిపుల్లా కాదేదీ కవితకనర్హం...’ అని ఆనాడు శ్రీశ్రీ చెప్పిన విషయం సాహితీప్రియులకు గుర్తుందో లేదో తెలియదు కానీ మన రాజకీయనాయకులు మాత్రం బాగా గుర్తుంచుకొని వంటపట్టించుకొన్నారు. అందుకే కులమతాలు, అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రజాసమస్యలు, రైతుల సమస్యలు అన్నిటినీ రాజకీయాలకు వాడేసుకొంటున్నారు. ఈవిధంగా ప్రతీఅంశాన్ని రాజకీయం చేయడం వలన అసలు సమస్య పరిష్కారం కాకపోయినా రాజకీయ పార్టీలు దానితో రాజకీయ మైలేజ్, లబ్ది పొందుతుంటాయి లేదా పొందాలని ప్రయత్నిస్తుంటాయి. 
ఉదాహరణకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు బంద్‌కు మద్దతు తెలిపి దానిలో పాల్గొబోతున్నాయి. అయితే అవి కేవలం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే పోరాడితే అందరూ సంతోషిస్తారు. కానీ బిజెపిపై రాజకీయ వ్యతిరేకత కారణంగా పోరాడుతూ రైతుల కోసమే పోరాడుతున్నామని చెప్పుకోవడమే సరికాదు.
కాంగ్రెస్ పార్టీకి బిజెపి బద్ద విరోది. అలాగే రాహుల్ గాంధీ నరేంద్రమోడీని ఓ ప్రధానిగా కాక తన రాజకీయశత్రువుగా భావిస్తూ ఆయన ఏమి చేసినా గుడ్డిగా వ్యతిరేకిస్తుంటారు. అది పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రయిక్స్ చేయడమైనా లేదా సరిహద్దులలో చైనాను నిలువరించడమైనా సరే...మంచిచెడులు విశ్లేషించకుండా వ్యతిరేకించడమే విదానంగా భావిస్తుంటారు. కనుక అదే కాంగ్రెస్ విధానమవుతుంటుంది. ఇప్పుడు వ్యవసాయబిల్లును కూడా కాంగ్రెస్ అందుకే వ్యతిరేకిస్తోందని చెప్పవచ్చు.
కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల కోసం అనేక చక్కటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఈవిషయంలో ఎటువంటి సందేహాలు లేవు. కానీ వ్యవసాయబిల్లును వ్యతిరేకిస్తూ రేపు జరుగబోయే భారత్ బంద్‌లో టిఆర్ఎస్ కూడా పాల్గొనాలనే ఆయన నిర్ణయం వెనుక బిజెపిని దెబ్బతీయాలనే రాజకీయ ఆలోచన కూడా ఇమిడి ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తం చేసిన అభిప్రాయం వింటే అది అర్దమవుతుంది. “జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓటమి పరాభవాన్ని కప్పిపుచ్చుకొనేందుకే సిఎం కేసీఆర్ వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. బంద్‌లో పాల్గొనాలని టిఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు,” అని అన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో లేదా కేంద్రప్రభుత్వంతో సఖ్యత ఉన్న రాష్ట్రాలలో రైతులు వ్యవసాయబిల్లును వ్యతిరేకించడం లేదు. కానీ బిజెపియేతర రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారు. అంటే పార్టీల రాజకీయ అవసరాలు లేదా ప్రయోజనాల మేరకు ఓ రాష్ట్రంలో బంద్ జరపాలా వద్దా?అని నిర్ణయం జరుగుతున్నప్పుడు ఇది రైతుల కోసం చేస్తున్న బంద్‌గా ఏవిధంగా భావించగలము? అంటే బంద్‌లో పాల్గొనడం, పాల్గొనకపోవడం వెనుక రాజకీయకారణాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈవిదంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, అధికార ప్రతిపక్షపార్టీలు తీసుకొనే కొన్ని నిర్ణయాలు నిజంగా సంబందితవర్గానికి ఏమైనా మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా తమ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టేందుకు, ఒకదానిపై మరొకటి పైచేయి సాధిచేందుకు మాత్రం ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.