రైతుబందు నిధులు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌

December 07, 2020


img

ఈనెల 27 నుంచి రాష్ట్రంలో రైతులకు రైతుబందు సొమ్ము అందజేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ, ఆర్ధికశాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశమైన సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఈనెల 27 నుంచి పది రోజులలోగా వారి బ్యాంక్ ఖాతాలలో రైతుబందు సొమ్ము జమా అయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. దీనికోసం తక్షణమే రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. 

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ నుంచి రైతుబంధు పధకం అమలుచేస్తోంది కనుక ఇదేమీ కొత్తవిషయం కాదు. అయితే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవయసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు జరుగబోయే భారత్‌ బంద్‌కు ముందు రైతుబందు నిధుల విడుదల చేయాలని నిర్ణయించడం కాస్త ఆలోచింపజేస్తుంది. కేంద్రప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంటే, తమ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రైతుబందు సాయం అందజేసి ఆదుకొంటోందని టిఆర్ఎస్‌ గట్టిగా చెప్పుకొనేందుకు అవకాశం ఉంటుంది. బహుశః రేపు భారత్‌ బంద్‌లో పాల్గొనే టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు, ప్రజాప్రతినిధులు ఈవిషయం గురించి గట్టిగా నొక్కిచెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. తద్వారా రాష్ట్రంలో బిజెపి కంటే టిఆర్ఎస్‌ అన్నివిధాల మేలైనదని ప్రజలకు సందేశం పంపినట్లవుతుంది కూడా. ఇది గ్రేటర్ ప్రభావం కావచ్చు...లేదా భారత్‌ బంద్‌ ప్రభావం కావచ్చు... ఏదిఏమైనప్పటికీ రైతులకు లబ్ది కలుగుతోంది కనుక సంతోషించదగ్గ విషయమే.


Related Post