బిజెపిపై కేసీఆర్‌ అలా ప్రతీకారం...

December 06, 2020


img

తెలంగాణలో తిరుగేలేదనుకొన్న టిఆర్ఎస్‌ను వరుసగా లోక్‌సభ, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో దెబ్బతీసి నిద్రపోతున్న సింహాన్ని బిజెపి తట్టిలేపింది. ఊహించినట్లే సిఎం కేసీఆర్‌ వెంటనే ప్రతిచర్యలు మొదలుపెట్టారు. 

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులను మొదటినుంచి టిఆర్ఎస్‌ వ్యతిరేకిస్తోంది కనుక వాటిని ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు సిఎం కేసీఆర్‌ సంఘీభావం ప్రకటించారు. వ్యవసాయబిల్లులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఈనెల 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. సిఎం కేసీఆర్‌ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారత్‌ బంద్‌లో రాష్ట్రంలో టిఆర్ఎస్‌ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ బంద్‌ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. 

ఈనెల 8న జరుగబోయే భారత్‌ బంద్‌కు ప్రతిపక్షపార్టీలు, బిజెపీయేతర ప్రభుత్వాలు, వివిద కార్మికసంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ కూడా వారికి మద్దతు ప్రకటించారు.     

ఢిల్లీలో రైతుల ఆందోళనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించడంతో కేంద్రప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. రైతు సంఘాల నాయకులతో పలుదఫాలు కేంద్రమంత్రులు చర్చలు జరిపినప్పటికీ వారు వ్యవసాయబిల్లులను ఉపసంహరించుకోవాలని పట్టుబడుతుండటంతో చర్చలు విఫలమవుతున్నాయి. ఈనేపద్యంలో రైతులు ఈనెల 8న జరుగబోయే భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఆవేదన యావత్ దేశంలో రైతులందరిదీ..వారి పోరాటం, డిమాండ్ రెండూ చాలా న్యాయబద్దమైనవి. కనుక వారి పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపారు. ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు గెలుచుకొని ఉండి ఉంటే సిఎం కేసీఆర్‌ ఈ బంద్‌కు మద్దతు పలికేవారో లేదో తెలియదు. కనుక టిఆర్ఎస్‌ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నందునే భారత్‌ బంద్‌కు మద్దతు పలుకుతున్నారా లేదా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోవడంతో సిఎం కేసీఆర్‌ అహం దెబ్బతిన్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నారో తెలియదు కానీ బిజెపిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటున్నారని భావించవచ్చు. 

అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలైపోయిన తరువాత ఈనెలాఖరులోగా దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలను  వ్యతిరేకించే పార్టీల అధినేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం ఏర్పాటుచేసి, మోడీ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభిస్తానని సిఎం కేసీఆర్‌ ముందే ప్రకటించారు. కనుక దాని కోసం కూడా సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బిజెపి సిఎం కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రయత్నిస్తుంటే, సిఎం కేసీఆర్‌ కేంద్రంలో మోడీని గద్దె దించడానికి ప్రయత్నిస్తుండటం విశేషమే కదా?


Related Post