 
                                        దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో వరుస ఘోరపరాజయాలు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలే. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి నిన్న సాయంత్రం రాజీనామా చేశారు. 
ఇకపై రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు అవి టిఆర్ఎస్-బిజెపిల మద్యనే సాగబోతున్నాయనేది స్పష్టమైంది. కనుక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా 'ఇల్లు తగులబడుతోందని ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంతోషించినట్లుంది’ కాంగ్రెస్ నేతల తీరు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగానే ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరూ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతుండగా, పిసిసి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు.
దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తెలంగాణ సాధన కోసం మంత్రిపదవిని కూడా త్యాగం చేశానని కనుక అధ్యక్ష పదవికి అన్నివిధాలా తానే అర్హుడినని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి మళ్ళీ పూర్వవైభవం తెస్తానని అన్నారు. చిరకాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చినవారికి అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదన్నారు.
పిసిసి అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నారు. కనుక వారిరువురూ ఏమంటారో చూడాలి.
రాష్ట్రంలోనో...కేంద్రంలోనో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే, ఈ పదవి కోసం పోటీ పడినా అర్ధం ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, భవిష్యత్ రెండూ కూడా అగమ్యగోచరంగా కనిపిస్తుంటే పిసిసి అధ్యక్ష పదవి కోరుకోవడం ముళ్ళకిరీటాన్ని నెత్తిని పెట్టుకోవాలనుకోవడమే అని చెప్పవచ్చు.
కొత్తగా అధ్యక్షపదవి చేప్పట్టబోయేవారు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌లాగా పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం కలిగించి టిఆర్ఎస్, బిజెపిలను ధీటుగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలి. పార్టీకి మళ్ళీ పూర్వవైభవం సాదించగలననే పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం, పోరాటపటిమ, అందరినీ కలుపుకుపోగల నాయకత్వలక్షణాలు కలిగి ఉండాలి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేసిన చిట్టచివరి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.