1.jpg) 
                                        జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దారుణంగా ఓడిపోవడంపై ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో మా పార్టీ ఓటమికి మీడియా కూడా ఓ కారణమని భావిస్తున్నాను. రాజకీయపార్టీలు తమ సొంత డప్పు కొట్టుకొనేందుకు సొంత మీడియాను ఏర్పాటు చేసుకొని వాటితో జనాలను మభ్యపెడుతున్నాయి. పైగా టిఆర్ఎస్, బిజెపి వంటి పార్టీలు మీడియా సంస్థలకు భారీగా ముట్టజెప్పి రాష్ట్రంలో రాజకీయవాతావరణం తమకు అనుకూలంగా మారుతున్నట్లు ప్రచారం చేసుకొంటున్నాయి. ఈ నేపధ్యంలో సొంత మీడియా లేని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. కనుక అవసరం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా సొంతమీడియాను ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇటువంటి రాజకీయాల వలన ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువ నమోదవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు తరలివచ్చి బిజెపి తరపున ఎన్నికల ప్రచారం చేస్తుంటే, ఇవి కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలే తప్ప శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు కావని పదేపదే చెప్పిన సిఎం కేసీఆర్, తన మంత్రులు ఎమ్మెల్యేలను పంపించి ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.
టిఆర్ఎస్-మజ్లీస్-బిజెపి మూడు పార్టీలు కలిసి ఆడిన ఈ ఆటలో మేము ఓడిపోయాము. నిజానికి ఈ ఎన్నికలలో మా పార్టీకి జరిగిన నష్టం కంటే ప్రజాస్వామ్యానికే ఎక్కువ నష్టం జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే మా ఓటు బ్యాంక్ ఈసారి 4 శాతం పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ టిఆర్ఎస్, బిజెపిలకు ధీటుగా పునర్నిర్మించుకొంటాము,” అని అన్నారు.