 
                                        ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ పూర్తవగానే రెండు మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. రెండూ కూడా టిఆర్ఎస్‌కే విజయావకాశాలున్నాయని తేల్చి చెప్పాయి. అయితే టిఆర్ఎస్ భావిస్తున్నట్లు 100 సీట్లు కాక ఈసారి కేవలం 68-78 సీట్లు మాత్రమే గెలుచుకొంటుందని జోస్యం చెప్పాయి. ఈసారి బిజెపి తప్పకుండా గెలవాలని చాలా పట్టుదలగా ప్రయత్నించినప్పటికీ 25-35 సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చునని రెండు సంస్థలు జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2-5 డివిజన్‌లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. అంటే ఈ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారబోతోందని భావించవచ్చు. మజ్లీస్ పార్టీకి 38-42 డివిజన్‌లు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టిఆర్ఎస్-బిజెపి-మజ్లీస్ ముక్కోణపు పోటీలో ఇతరులెవరికీ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని స్పష్టం చేశాయి. 
రేపు ఉదయం 8.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలలోపుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతోందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
|  | ఆరా | ||||
|  | టిఆర్ఎస్ | బిజెపి | కాంగ్రెస్ | మజ్లీస్ | ఇతరులు | 
| ఓట్ షేర్ | 40.0 శాతం (+/-) 3% | 31.21 శాతం (+/-) 3% | 8.58 శాతం (+/-) 3% | 13.43 శాతం (+/-) 3% | 7.70 శాతం (+/-) 3% | 
| గెలుచుకోబోయే డివిజన్‌లు/సీట్లు | 78 (+/-) 7 | 28 (+/-) 5 | 03 (+/-) 3 | 41 (+/-)5 | 0 | 
|  | పీపుల్స్ పల్స్ | ||||
| గెలుచుకోబోయే డివిజన్‌లు/సీట్లు | 68-78 | 25-35 | 1-5 | 38-42 | 0 |