2.jpg) 
                                        ప్రముఖ తమిళనటుడు రజినీకాంత్ ఎట్టకేలకు ఇవాళ్ళ తన రాజకీయ ప్రవేశం గురించి నిర్ధిష్టమైన ప్రకటన చేశారు. డిసెంబర్ 31వ తేదీన కొత్త పార్టీకి సంబందించి పూర్తి వివరాలను ప్రకటిస్తానని, వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని, కనుక అభిమానులందరూ అందుకు సిద్దంగా ఉండాలని ట్వీట్ చేశారు. ‘మార్పు చాలా అవసరం ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడూ కాదంటూ’ తమిళంలో ట్వీట్ చేశారు. 
రజినీకాంత్ ప్రకటనతో ఆయన అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా రాజకీయ ప్రవేశం చేస్తానని చెపుతూ, గత మూడేళ్ళుగా ఇదిగో... అదిగో అంటూ ఊరిస్తూ అభిమానుల సహనాన్ని పరీక్షించిన రజినీకాంత్, సినిమాలలో హీరోయిజం ప్రదర్శిస్తారు కానీ నిజజీవితంలో ధైర్యం చూపలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు తన భయాలు, ఆలోచనలు, అనుమానాలు అన్నీ పక్కనపెట్టి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేసారు.
ఇప్పటికే ఆయన సహ నటుడు కమల్ హాసన్‌తో సహా మరో ఇద్దరు నటులు రాజకీయ పార్టీలు స్థాపించి ఎన్నికలలో విఫలయత్నం చేస్తున్నారు. రజినీకాంత్ కూడా వారి జాబితాలోనే చేరుతారా లేక ఎన్నికలలో గెలిచి స్వర్గీయ ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలా తమిళరాజకీయాలలో కొత్తశకం ప్రారంభిస్తారో చూడాలి.