 
                                        దేశంలో పలు రాష్ట్రాలలో రెండోదశ కరోనా మొదలైనట్లు నిత్యం వార్తలు వినిపిస్తున్నా అన్ని రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా వేలాదిమందితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం చేయడం అందరూ చూశారు. బస్సులు, రైళ్ళు, సినిమాహాల్స్‌లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ   సాక్షాత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేలాదిమందితో హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తిప్పలు పడిందో అందరికంటే సిఎం కేసీఆర్‌కేబాగా తెలుసు. కానీ ఆయన కూడా ఎల్బీ స్టేడియంలో సుమారు 40,000 మందితో బహిరంగసభ నిర్వహించారు. బిజెపి, టిఆర్ఎస్, మజ్లీస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలందరూ పోటాపోటీగా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. 
రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ తదితర శాఖలు విభాగాల ఉద్యోగులు గత 8-9 నెలలుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటం అందరూ చూశారు. కరోనాపై పోరాడుతూ అనేకమంది వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగాపెడితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలుపు కోసం రాజకీయపార్టీలు వేలాదిమందితో ఎన్నికల ప్రచారం నిర్వహించి రాష్ట్రంలో మళ్ళీ కరోనా పెరిగేందుకు వీలు కల్పించడం చాలా శోచనీయం...బాధ్యతారాహిత్యమే అనుకోకతప్పదు.
పోలింగ్ కేంద్రాలలో కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం, తన కళ్లెదుటే రాజకీయ పార్టీలు వేలాదిమందితో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తుంటే చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవడాన్ని ఏమనుకోవాలి?అలాగే వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎన్నికల ప్రచారాన్ని అసలు పట్టించుకోలేదు.
కనుక నగరంలో...రాష్ట్రంలో మళ్ళీ భారీగా కరోనా కేసులు పెరిగినా ఆశ్చర్యం లేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు, ఈ ప్రమాదాన్ని ఇప్పుడు గుర్తించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ రావు, నిన్న మీడియాతో మాట్లాడుతూ, “జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చాలామంది కరోనా జాగ్రత్తలు పాటించలేదనే విషయం మా దృష్టికి వచ్చింది. కనుక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు అందరూ తప్పనిసరిగా 7 రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలను, కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతున్నాము. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలందరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటిస్తుండాలి. వ్యాక్సిన్ వేసుకొన్న తరువాత కూడా కొన్ని నెలలు కరోనా జాగ్రత్తలు పాటిస్తుండటం మంచిది. కరోనా నుంచి కోలుకొన్నవారు కనీసం 3-12 నెలలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది,” అని అన్నారు.
పోలీసులు, ఎన్నికల సంఘం ఆదేశాలనే పట్టించుకొని రాజకీయ పార్టీలు ప్రజారోగ్య అధికారి చేసిన ఈ సూచనను పట్టించుకొంటాయనుకోవడం అత్యశే కదా?