వైన్ షాపుల ముందు క్యూ కాస్తారు కానీ...

December 02, 2020


img

హైదరాబాద్‌ ఓటర్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 149 డివిజన్‌లలో కలిపి మొత్తం 46.68 శాతం పోలింగ్ నమోదైంది. అంటే నగరంలో మిగిలిన 63శాతం ఓటర్లు ఇళ్ళకే పరిమితమయ్యారు లేదా నాలుగురోజులు వరుసగా సెలవులు కలిసిరావడంతో సొంతూళ్ళకో లేదా విహారయాత్రలకో వెళ్ళిపోయి ఉండవచ్చు. హైదరాబాద్‌ సమస్యలపై సోషల్ మీడియాలో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ఈ ఓటరు మహాశయులు ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు ఓటు వేయలేదు? ఓటు వేయనప్పుడు వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎండుకుంటుంది?అనే ప్రశ్న సర్వత్రా వినబడుతోంది. 

రెండు నెలల క్రితం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించగానే వైన్ షాపుల ముందు కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో గంటలకొద్దీ ఓపికగా భౌతికదూరం పాటిస్తూ నిలబడి మద్యం కొనుకొని తాగి చిందులు వేశారు. కరోనా కారణంగా గణేశ్ నిమజన్నానికి పోలీసులు అనుమతించకపోతే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిస్తున్నా కరోనా మహమ్మారి పొంచి ఉన్నా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిమజ్జనంలో పాల్గొన్నారు. అదేవిధంగా వివిద పండుగల సందర్భంగా నగరంలోని అన్ని ఆలయాలు, మసీదులు భక్తులతో కిటకిటలాడాయి. 

అలాగే మొన్న ప్రభుత్వం వరదసాయం పంపిణీ చేసినప్పుడు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. వరదసాయం అందనివారు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. అధికారులను చుట్టుముట్టి గట్టిగా నిలదీశారు. మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం చెప్పగానే వేలాదిమంది పౌరులు తరలివచ్చి గంటలకొద్దీ ఓపికగా క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న పోలింగ్ పూర్తయిన తరువాత మళ్ళీ మద్యం షాపులు తెరవగానే మందుబాబులు పరుగులు పెట్టి అక్కడకు చేరుకొని ఓపికగా క్యూలో నిలబడి మద్యం కొనుకొని తాగారు. కానీ కోట్లాదిరూపాయల ప్రజాధనం ఖర్చు చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటు వేసేందుకు పెద్దగా జనం రాలేదు! ఎందుకు రాలేదు? అంటే ఓటు వేయడం వలన ఎటువంటి ‘లాభం’ ఉండదనా? నేనొక్కడినే వేయకపోయినా ఏమీ కాదనా? ఓటు వేయడం కంటే మద్యం తాగడం , పూజలు, ప్రార్ధనలు చేసుకోవడమే ముఖ్యమనుకొన్నారా?      

హైదరాబాద్‌ ఓటర్ల తీరుపై సిపి సజ్జనార్ కూడా విచారం వ్యక్తం చేశారు. అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉంటే బాగుండేదని అన్నారు. ఇకపై ఓటు హక్కు వినియోగించుకొన్నవారికి ప్రోత్సాహకాలు లేదా ప్రభుత్వ పధకాలలో ప్రాధాన్యత ఇస్తూ, ఓటు వేయనివారికి వాటిని కత్తిరిస్తే బాగుంటుందన్నారు. ఇంతగా పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం, మేధావులు, ప్రజలు కూడా లోతుగా ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.


Related Post