 
                                        టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ స్థానికల సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో తాను నిజామాబాద్‌లో ఉంటున్నట్లు పేర్కొన్నారని, కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకొన్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారధికి ఫిర్యాదు చేశారు. ఒకే వ్యక్తి వేర్వేరు చిరునామాలతో రెండు వేర్వేరు ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగించుకోవడం నేరం కనుక ఆమెపై అనర్హత వేటువేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన తరువాత ‘ఆమె నేను నా ఓటు హక్కు వినియోగించుకొన్నాను. మీరు కూడా బయటకు వచ్చి ఓటేయండి…’ అంటూ ప్రజలకు పిలుపునిస్తూ ఆమె చేసిన  ట్వీట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. 
ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉన్న కవిత ఈవిధంగా చేయడం చాలా విస్మయం కలిగిస్తుంది. చట్టప్రకారం ఇది సమంజసమే అయినప్పటికీ ఒక వ్యక్తి ఏదో ఒక చిరునామాతోనే ఓటు హక్కు వినియోగించుకోవడం నైతికపద్దతి. మరి కవిత ఈవిధంగా ఎందుకు చేశారో? దీనిపై ఆమె ఏమి సమాదానం చెపుతారో చూడాలి? ఒకవేళ ఆమె చేసింది తప్పు కానట్లయితే ప్రజలందరూ కూడా ఇకపై రాష్ట్రంలో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పకూడదు.