తెలంగాణ బిజెపీకి బాహుబలి దొరికినట్లేనా?

December 02, 2020


img

ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి శ్రేణులు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా అధికార టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడం అందరూ చూశారు. అందుకు ప్రధాన కారకుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అని చెప్పకతప్పదు. ఆయన నాయకత్వంలో పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలను చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. అందుకు ప్రధాని నరేంద్రమోడీ బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి అభినందించడం విశేషం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన తీరు, టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలను ఎదుర్కొనేందుకు రచించిన వ్యూహాలు, టిఆర్ఎస్‌ అధికార దుర్వినియోగం తదితర అంశాల గురించి బండి సంజయ్‌ ప్రధాని నరేంద్రమోడీకి వివరించారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ ఎన్నికలలో పార్టీ నేతలు, కార్యకర్తలు అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించారని ప్రధాని నరేంద్రమోడీ అందరినీ అభినందించారని బిజెపి తెలిపింది. ఇక ముందు ఇదే పోరాటస్పూర్తితో... ఇదేవిధంగా ధైర్యంగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్రమోడీ బండి సంజయ్‌ను కోరినట్లు బిజెపి తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ సుమారు 10 నిమిషాలు బండి సంజయ్‌తో మాట్లాడినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ఇంకా బాహుబలి కోసం ఎదురుచూస్తుంటే, బిజీపీకి బండి సంజయ్ రూపంలో బాహుబలి దొరికేశాడు. దుబ్బాక ఉపఎన్నికలలో, మళ్ళీ ఇప్పుడుజీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తన పోరాటపటిమను చూపి సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీనే మెప్పించగలిగారు. తెరాస ఆయనను బళ్లాలదేవుడనవచ్చు గాక కానీ రాష్ట్ర బిజేపీకి బండి సంజయ్ నూటికి నూరుశాతం బాహుబలే. 


Related Post