కాషాయ మాస్కుతో రాములమ్మ... ముహూర్తం ఖరారు?

December 01, 2020


img

కాంగ్రెస్‌ ప్రచారకమిటీ చైర్ పర్సన్‌ విజయశాంతి, దుబ్బాకలోను ప్రచారానికి వెళ్ళలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనూ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. కానీ సోషల్ మీడియాలో బిజెపికి అనుకూలంగా టిఆర్ఎస్‌పై, సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ్ళ తన ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఆమె మొహానికి కాషాయరంగు మాస్క్ ధరించి రావడం ద్వారా బిజెపిలో చేరబోతున్నట్లు మరో సంకేతం ఇచ్చినట్లు అనుకోవాలేమో? తాజా సమాచారం ప్రకారం ఆమె ఈనెల 7వ తేదీన ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆమె గత నెల 24వ తేదీన ఢిల్లీ వెళ్ళి బిజెపిలో చేరి మరుసటి రోజు నుంచే బిజెపి తరపున జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు వినిపించాయి. అప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు. తాను బిజెపిలో  చేరబోతున్నానంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఆమె అసలు స్పందించలేదు. అంటే మౌనంగా ఉండటం ద్వారా అవి నిజమని ఆమె దృవీకరించారనుకోవచ్చు. 

ఇవాళ్ళ ఆమె ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు కూడా అక్కడ విలేఖరులు ఆమెను బిజెపిలో ఎప్పుడు చేరుతున్నారంటూ ప్రశ్నించారు కానీ ఆమె సమాధానం చెప్పకుండా ఓ చిర్నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు. ఆమెపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలేసుకొంది. అలాగే ఆమె కూడా బిజెపికి దగ్గరవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ట్వీట్ల ద్వారా వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. కనుక ఆమె ఈనెల 7వ తేదీన బిజెపిలో చేరకుండా ఉండటానికి కారణాలేవీ కనబడటం లేదు.


Related Post