మధ్యాహ్నం 3 గంటలకు 25.34 శాతం మాత్రమే పోలింగ్

December 01, 2020


img

ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. నగర పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా వారి ఆగ్రహావేశాలను తమకు అనుకూలంగా మలుచుకొని జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో లబ్ది పొందాలని గట్టిగా ప్రయత్నించాయి. వరదసాయం అందించి ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. సరిగ్గా వరదల తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి హైదరాబాద్‌ నగర పరిస్థితిపై చాలా విస్తృతంగా చర్చ జరిగింది. కనుక ఈసారి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారని అందరూ భావించారు. కానీ మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 25.34 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అంటే వందమందిలో కేవలం 25మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేశారన్న మాట. మిగిలినవారు ఇంతవరకు ఇళ్ళలో నుంచి బయటకు రాలేదు. లేదా నాలుగు రోజులు వరుస శలవులు వచ్చినందున హాయిగా తమ ఊళ్ళకు లేదా కార్తీకమాసం పిక్నిక్‌లకు వెళ్ళిపోయుంటారు. పోలింగ్‌ గడువు ముగియడానికి ఇంకా కేవలం 3 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మూడు గంటలలోనైనా నగర ప్రజలు పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేస్తారో లేదో చూడాలి. 

నగరంలో కొన్ని డివిజన్‌లలో మధ్యాహ్నం ఒంటిగంటకు 0.56 శాతం పోలింగ్ మాత్రమే నమోదవడం చాలా దారుణంగా ఉందని వారి ఓట్ల కోసం కుమ్ములాడుకొంటున్న రాజకీయనాయకులు, కార్యకర్తలే అంటున్నారు. నగరంలో 14 డివిజన్‌లలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 5 శాతం కంటే తక్కువే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కొన్ని డివిజన్‌లలో 16 నుంచి 28 శాతం పోలింగ్ నమోదైంది.            

కేపీహెచ్‌బీ డివిజన్‌: 16.04 శాతం,

బోయినపల్లి డివిజన్‌: 16.14 శాతం, 

అల్లాపూర్‌ డివిజన్‌: 18.23 శాతం, 

వివేకానందనగర్ డివిజన్‌: 20.79 శాతం, 

బాలానగర్ డివిజన్‌: 20.99 శాతం, 

హైదర్‌నగర్ డివిజన్‌: 22.52 శాతం, 

ఫతేనగర్ డివిజన్‌: 23.58 శాతం, 

ఆల్విన్ కాలనీ డివిజన్‌: 23.7 శాతం,

కూకట్‌పల్లి డివిజన్‌: 24.38 శాతం,

బాలాజీనగర్ డివిజన్‌: 26.52 శాతం,

మూసాపేట డివిజన్‌: 28.32 శాతం


Related Post