తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికలు?

December 01, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలు...వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో వేడెక్కిపోయిన తెలంగాణ రాష్ట్రం త్వరలో మళ్ళీ మరో ఉపఎన్నికలకు సిద్దం కావలసివస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈరోజు అనారోగ్యంతో చనిపోవడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత ఫిబ్రవరిలోగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగవలసి ఉంది. కనుక అప్పుడే నాగార్జునసాగర్ నియోజకవర్గానికీ కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తుందా లేదా ఆరు నెలలు గడువు ఉంటుంది కనుక మే-జూన్‌ నెలల్లో నిర్వహిస్తుందా? అనే విషయం రానున్న రోజులలో తెలుస్తుంది. 

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీ ఇచ్చినందున సాగర్ ఎన్నికలలో కూడా మళ్ళీ టిఆర్ఎస్‌ను ఢీకొనేందుకు సై అనడం ఖాయం. వరుస అపజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నికలు మరో గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. కనుక ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఎదుర్కోవలసి రావచ్చు. కనుక సాగర్ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు మరో అగ్నిపరీక్షగానే మారే అవకాశం ఉంది.


Related Post