జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోతే ఏమవుతుంది?

November 30, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సాగిన తీరు చూస్తే ఇవి శాసనసభ లేదా లోక్‌సభ ఎన్నికలో అన్నట్లు సాగగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

గ్రేటర్ పరిధిలో 24 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అంటే ఇవి మినీ అసెంబ్లీ ఎన్నికలవంటివేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తే దానికి రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉన్నట్లు రుజువు అవుతుంది. కనుక ఈ ఎన్నికలను టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడాయి.

రెండో కారణం ఏమిటంటే దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఏవిధంగా దెబ్బ తీయవచ్చో తెలుసుకొన్న బిజెపి అదే ఊపులో...అదే మంత్రంతో...జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా దెబ్బతీసి రాష్ట్రంలో తన బలం, రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు పెంచుకోవాలని కృతనిశ్చయంతో పోరాడినట్లు అర్ధమవుతోంది. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీనిచ్చింది. అయితే ప్రజలు,మీడియా, టిఆర్ఎస్‌ ఊహించినదానికంటే కూడా చాలా గట్టిగా టిఆర్ఎస్‌ను ఢీకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. 

టిఆర్ఎస్‌కు రాజకీయంగానే కాక పాలనాపరంగా కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలవడం చాలా ముఖ్యం. ఈ ఎన్నికలలో బిజెపికి ఏమాత్రం చోటు దక్కినా టిఆర్ఎస్‌కు, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే టిఆర్ఎస్‌ కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ఈసారి సిఎం కేసీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారసభ నిర్వహించడమే అందుకు నిదర్శనం.  

ఈ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఇంతవరకు రాష్ట్రంలో తనకు ఎదురేలేదని భావిస్తున్న టిఆర్ఎస్‌కు, బిజెపి ఎదురుదాడి ప్రారంభిస్తే అది ఏవిధంగా ఉంటుందో రుచి చూపించిందని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలలో బిజెపి, గెలిచినా, ఓడినా ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని భావించవచ్చు. కనుక ఇక నుంచి టిఆర్ఎస్‌ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

అలాగే సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు ఈ ఎన్నికలలో 100కు పైగా సీట్లతో టిఆర్ఎస్‌ గెలిస్తే, ఆయన వ్యూహాల ముందు బిజెపి వ్యూహాలు ఏమాత్రం సరిపోవని రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా కష్టమని బిజెపికి అర్ధమవుతుంది. 

టిఆర్ఎస్‌-బిజెపిలమద్య ఇంత రసవత్తరంగా పోటీ సాగినందున ఈ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ డిసెంబర్‌ 4న ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడవలసిందే.


Related Post