రేవంత్‌ రెడ్డి చెప్పింది నిజమే కదా?

November 30, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బిజెపి ఇంత బలపడటానికి కారణం సిఎం కేసీఆరే. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండకూడదని మా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడంతో రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు అవకాశం కల్పించారు. పామును పెంచి పోషిస్తే అది పెంచినవాడినే కాటేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో బిజెపిని పెంచిపోషించడంతో అదే ఇప్పుడు సిఎం కేసీఆర్‌కు ఆయన పార్టీకి, ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సవాలు విసురుతోంది,” అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. పైగా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో నాయకత్వ సమస్యతో బాధపడుతోంది.  కానీ బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది...16 రాష్ట్రాలలో ప్రత్యక్షంగా లేదా మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి చాలా బలమైన నాయకత్వం ఉంది. కనుక బిజెపితో పోలిస్తే ఏవిధంగా చూసిన కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లే. అటువంటి బలహీనమైన కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపులతో పూర్తిగా నిర్వీర్యం చేయడం వలననే, అన్ని విధాలా టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల కంటే చాలా బలమైన బిజెపి రాష్ట్రంలో నిలద్రొక్కుకొని ఇప్పుడు టిఆర్ఎస్‌కే గట్టిగా సవాలు విసురగలిగే స్థాయికి ఎదిగింది.

రాష్ట్రంలో బిజెపి బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతోందని గుర్తిస్తున్న రాజకీయ నాయకులు నీరు పల్లమెరుగు... బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు అప్పుడే బిజెపిలోకి క్యూ కడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి గెలిచినా లేదా 35-50 సీట్లు గెలుచుకొన్నా రాష్ట్రంలో మరింత బలపడుతుంది...వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసురుతుంది.

దీనికంతటికి కారణం బలహీనమైన కాంగ్రెస్ పార్టీ వలన టిఆర్ఎస్‌కు ఎటువంటి ప్రమాదమూ ఉండదని తెలిసినా టిఆర్ఎస్‌కు ఎదురే ఉండకూడదనే ఆలోచనతో ఫిరాయింపుల పేరుతో దానిని పూర్తిగా నిర్వీర్యం చేయడమే అని చెప్పక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్‌ స్థానంలో బలమైన బిజెపి ప్రవేశించి టిఆర్ఎస్‌కు సవాలు విసురుతోంది. ఇది టిఆర్ఎస్‌ స్వయంకృతాపరాదమే కనుక ఇప్పుడు బిజెపిని ఏవిధంగా ఎదుర్కోవాలో ఆ పార్టీయే ఆలోచించుకోక తప్పదు. 


Related Post