 
                                        జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి, పార్టీ ముఖ్యనేతలు తరలివస్తుండటంపై టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల స్పందన ఆసక్తికరంగా ఉంది. 
ఒక్క బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు ఇంతమంది నేతలా?వరదలు వచ్చినప్పుడు ఒక్కరూ రాలేదు కానీ ఇప్పుడు వరదలా వచ్చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం అయిపోగానే ఢిల్లీ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఎన్నికల వరకు వాళ్ళెవరూ మీకు కనబడరు. నేను, నా పార్టీ నేతలు, నా ప్రభుత్వం మాత్రమే ఉంటాము. కనుక ఢిల్లీ నుంచి వచ్చిపోతే రాజకీయ పర్యాటకుల మాటలు విని మోసపోకండి. వాళ్ళ కంటే మనకే నగరంలో ప్రశాంతమైన వాతావరణం చాలా అవసరం. అప్పుడే హైదరాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ఫలాలు మనందరికీ లభిస్తాయి. కనుక అభివృద్ధిని చూసి ఓటేయండి,” అని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.
మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న పాతబస్తీలోని ఝాన్సీ బజార్‌లో గుజరాతీలు, మార్వాడీ, బెంగాలీ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఢిల్లీ నుంచి వరుసగా బిజెపి నేతలు, కేంద్రమంత్రులు తరలివస్తున్నారు. వారిని చూస్తోంటే ఇవేమైనా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలా...అనిపిస్తోంది? బిజెపిలో అందరూ ఎన్నికల ప్రచారానికి వచ్చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలిపోయారు. వీలైతే ఆయనను రప్పించేసేవారేమో?” అని వ్యంగ్యంగా అన్నారు.
వ్యాపారవర్గాలకు మజ్లీస్ పార్టీ దూరమైందని అసదుద్దీన్ ఓవైసీ అంగీకరించడం విశేషం. “ఇంతకాలం మీరు మాకు దూరంగా ఉంటూ బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకే ఓట్లేశారు. కానీ ఇక్కడ ఒకేచోట నివశిస్తున్న మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే మన డివిజన్‌ను అభివృద్ధి చేసుకోగలుగుతాము. కావాలంటే లోక్‌సభ ఎన్నికలలో మీకు నచ్చిన పార్టీకి ఓట్లేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే మాకే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రాణాలతో జీవించి ఉన్నంతవరకు మతఘర్షణలు జరుగకుండా నగరాన్ని కాపాడుకొంటాను," అని మీ అందరికీ మాటిస్తున్నాను,” అని అన్నారు.