జీహెచ్‌ఎంసీ అధికార పగ్గాలు మారితే ఏమవుతుంది?

November 28, 2020


img

ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టిపోటీనిస్తున్న మాట వాస్తవం. అయితే అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ప్రజలను ఓట్లు కోరుతున్న మంత్రి కేటీఆర్‌, బిజెపికి ఏమి చూసి ఓట్లేస్తారని ప్రజలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ గుండెకాయ వంటిదని, నగరంలో అశాంతి, అస్థిర రాజకీయవాతావరణం ఏర్పడితే పరిశ్రమలు, పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న హైదరాబాద్‌ నష్టపోతే ఆ ప్రభావం యావత్ రాష్ట్రంపై పడుతుందని, అభివృద్ధి సంక్షేమ పధకాలకు ఆటంకాలు ఏర్పడితే నష్టపోతామని మంత్రి కేటీఆర్‌ చాలా సూటిగా ప్రజలకు నచ్చచెపుతున్నారు. 

కనుక ఒకవేళ హైదరాబాద్‌ ప్రజలు మంత్రి కేటీఆర్‌ వాదనలతో ఏకీభవిస్తే టిఆర్ఎస్‌ మళ్ళీ గెలుస్తుంది. ఒకవేళ నగర ప్రజలు తాత్కాలిక భావోద్వేగాలకు లొంగితే బిజెపి గెలుస్తుంది. 

ఈ ఎన్నికలలో బండి సంజయ్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. కనుక ఈ ఎన్నికలలో బిజెపి గెలువలేకపోయినా కనీసం 35-50 సీట్లు గెలుచుకొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగితే టిఆర్ఎస్‌ ప్రస్తుతం కటీఫ్ చెప్పేసిన మజ్లీస్‌ పార్టీపైనే మద్దతు కోసం ఆధారపడక తప్పదు. అప్పుడు గులాబీ కారు ఇప్పటిలా వేగంగా దూసుకుపోలేదు. ఓవైసీ సోదరులు పక్కన కూర్చొని కారు స్టీరింగ్ తిప్పుతుంటే వెనుకసీటులో కూర్చోన్న బిజెపి కాకిలా పొడుస్తూనే ఉంటుంది కనుక డ్రైవింగ్ చాలా కష్టం.

ఒకవేళ జీహెచ్‌ఎంసీలో బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే జీహెచ్‌ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య దూరం పెరుగుతుంది కనుక రెండూ చాలా ఇబ్బందిరకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకు కొత్త సచివాలయం నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతించకపోతే ప్రభుత్వం ముందుకు అడుగువేయలేదు. అలాగే ప్రభుత్వం సహకరించకపోతే జీహెచ్‌ఎంసీ మనుగడ చాలా కష్టమవుతుంది. రెండూ వేర్వేరు పార్టీల నేతృత్వంలో పనిచేస్తుంటే వాటిమద్య సహజంగానే రాజకీయవైరం కారణంగా విభేదాలు మొదలవుతాయి కనుక అభివృద్ధి కుంటుపడే ప్రమాదం కూడా ఉంటుంది. 


Related Post