జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపద్యంలో హైదరాబాద్ పెద్ద రాజకీయ రణరంగంగా మారడంతో దక్షిణాదిరాష్ట్రాలను ఎన్నడూ పెద్దగా పట్టించుకొని జాతీయమీడియా సైతం నగరంలో జరుగుతున్న రాజకీయపరిణామాలపై వార్తలు, ప్రముఖుల  ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ జాతీయమీడియా సంస్థ ఇండియాటుడేకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు: 
ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి తన సర్వశక్తులను ఒడ్డి పోరాడుతోంది. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ బాధ్యతను భుజానికెత్తుకొన్న మీరు ఢిల్లీ నుంచి వస్తున్న అతిరధమహారధుల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారా?
జవాబు: లేదు. నిజానికి చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక సాధారణ మునిసిపల్ ఎన్నికలలో మా పార్టీని ఎదుర్కోవడానికి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, బిజెపి అగ్రనేతలు తరలివస్తుండటం చూస్తే, వాళ్ళు మాపార్టీ బలాన్ని సరిగ్గానే గుర్తించినట్లు అర్ధమవుతోంది. శాసనసభ ఎన్నికలలో కూడా ఇలాగే అందరూ తరలివచ్చారు. కానీ 101 స్థానాలలో బిజెపి డిపాజిట్లు కోల్పోయింది. ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. ఇప్పుడూ అలాగే జరుగనుంది.
ప్రశ్న: లోక్‌సభ, దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి గెలుపుతో రాష్ట్రంలో ఆ పార్టీ బలపడి మీకు సవాలు విసిరే స్థాయికి ఎదిగిందని భావిస్తున్నారా?
జవాబు: లేదు. నిజానికి దుబ్బాక ఉపఎన్నికలలో చాలా కొద్దిపాటి ఓట్ల తేడాతో విజయం చేజార్చుకొన్నాము. లోక్‌సభ ఎన్నికలలో మాకు కొంత ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆ తరువాత వెంటనే జరిగిన స్థానికసంస్థల ఎన్నికలలో మా పార్టీ తిరుగులేని విజయం సాధించింది. వాటిలో బిజెపి వెనకబడిపోయింది. ఒకటి రెండు ఎన్నికలలో విజయమే పార్టీ ఎదుగుదలకు, బలానికి నిదర్శనమని చెప్పుకోవలసివస్తే గత ఆరున్నరేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికలలో మేమే గెలిచాము కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు తిరుగులేదని చెప్పుకోగలం.
ప్రశ్న: హైదరాబాద్‌లో మైనార్టీలు ఎక్కువగా ఉండటం, మజ్లీస్ పార్టీ ఉండటాన్ని బిజెపికి సానుకూలంగా భావిస్తోందా? తన హిందుత్వవాదనతో పాగా వేయడానికి హైదరాబాద్ నగరమే సరైనదని గుర్తించి ఇప్పుడు హిందుత్వతో హిందువుల ఓట్లు పోలరైజేషన్ చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందా?
జవాబు: ఈ ఎన్నికలలో బిజెపి మతరాజకీయాలు చేస్తున్న మాట వాస్తవమే. బిజెపి చెపుతున్న సర్జికల్ స్ట్రైక్స్ , బాబర్, బిన్ లాడెన్, సమాధులు తవ్వుకోవడంతో హైదరాబాద్ ప్రజలకి ఏమి సంబందం?ఈ ఎన్నికలకు వాటికీ ఏం సంబందం?ప్రతిపక్షాల మాటలకు ప్రజలు బుట్టలోపడతారనుకోను. నగరప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, మౌలికవసతుల కల్పన, ఉద్యోగాలు,ప్రశాంతమైన వాతావరణం తదితర అంశాలకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప నగరానికి ఏదో మతపరమైన పేరు లేదా ముద్రపడాలనుకోరు కదా? వాటి వలన ప్రజలకు ఉపయోగం కూడా ఉండదు. గత ఆరున్నరేళ్ళుగా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉంది. ఇక ముందు ఏమి చేయబోతున్నామో కూడా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. కనుక ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము.
ప్రశ్న: టిఆర్ఎస్-మజ్లీస్‌ల మద్య అవగాహన ఉందని బిజెపి ఆరోపిస్తోంది?
జవాబు: నిజానికి బిజెపికి మజ్లీస్ మద్య అవగహన ఉన్నందునే బిహార్ శాసనసభ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ 5 సీట్లు గెలుచుకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. మజ్లీస్ పార్టీ అక్కడ పోటీ చేసి ఓట్లు చీల్చడం వలననే ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగలిగింది. ప్రతిపక్ష కూటమి అధికారం చేజార్చుకొంది కదా?నిజానికి మా టిఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని అంశాలలో కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కానీ అంతమాత్రన్న బిజెపితో పొత్తులు పెట్టుకొన్నట్లు కాదు కదా?మజ్లీస్ పార్టీ కూడా అదేవిధంగా అంశాలవారీగా మాకు మద్దతు ఇస్తోంది. కానీ మా రెండు పార్టీల మద్య ఎటువంటి పొత్తులు లేవు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మా పార్టీ 150 స్థానాలకు పోటీ చేస్తుండటమే అందుకు తాజా నిదర్శనం.
ప్రశ్న: రాష్ట్రంలో బిజెపి బలపడుతుండటం మీ పార్టీకి ఆందోళన కలిగిస్తోందా? మేల్కొవలసిన సమయం వచ్చిందని భావిస్తున్నారా?
జవాబు: రాష్ట్రంలో ఎప్పుడూ బిజెపి ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో ఇంకా చాలా పార్టీలున్నాయి. వాటిలో బిజెపి కూడా ఒకటి. అది మతరాజకీయాలతో ప్రజలను విడదీసి తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలలో ఒక్కోసారి అది సఫలం అవుతుంటుంది చాలాసార్లు విఫలమవుతుంది. అయితే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మా పార్టీ మతరాజకీయాలకు పరిమితమైన బిజెపిని చూసి భయపడనవసరం లేదు.
ప్రశ్న: ఈ ఎన్నికలలో మీది గల్లీస్థాయి పార్టీ, బిజెపి ఢిల్లీపార్టీ అని చెప్పుకొంటున్నారు?
జవాబు: ప్రధాని నరేంద్రమోడీయే స్వయంగా ‘ఓకల్ ఫర్ లోకల్’ అని నినాదం ఇచ్చారు. అంటే స్థానికానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని అర్ధం. మేము తెలంగాణకు మాత్రమే పరిమితమైన స్థానిక ప్రాంతీయ పార్టీ కనుక మమ్మల్ని మేము గల్లీ బాయ్స్ అని గర్వంగా చెప్పుకొంటాము. కానీ బిజెపి జాతీయ పార్టీ. అందుకే దానిని ఢిల్లీ పార్టీ అంటున్నాము.
ప్రశ్న: ఈ ఎన్నికలలో గల్లీ పార్టీ గెలుస్తుందా లేదా ఢిల్లీ పార్టీ గెలుస్తుందనుకొంటున్నారా?
జవాబు: ఖచ్చితంగా మా గల్లీ పార్టీయే. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కోరుకొంటారే తప్ప మతరాజకీయాలు కాదు కనుక.