శాంతిభద్రతల పేరుతో బిజెపిపై బురదజల్లుతున్నారు

November 26, 2020


img

రాష్ట్ర బిజెపి నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఎన్నికలను వాయిదా వేయించేందుకు నగరంలో లేదా చుట్టుపక్కల జిల్లాలలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ సిఎం కేసీఆర్‌ ఆరోపించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇద్దరూ ప్రజలను భయపెట్టేందుకే నగరంలో లేదా రాష్ట్రంలో బిజెపి అల్లర్లకు కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు దుబ్బాక ఉపఎన్నికలలో కూడా ఇలాగే మాపార్టీ గురించి చెడుగా దుష్ప్రచారం చేశారు. కానీ దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్‌ను నమ్మలేదు. మా పార్టీనే గెలిపించారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షపార్టీలపై ప్రజలకు అపనమ్మకం కలిగేలా ఇటువంటి ప్రకటనలు చేయడం ఏమిటి? ఒకవేళ హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందంటే కేంద్రప్రభుత్వం చూస్తూ ఊరుకొంటుందా?ప్రధాని నరేంద్రమోడీ పాలనలో ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా శాంతిభద్రతలకు భంగం కలుగలేదు. ఇక ముందు కూడా కలుగనీయం. కేంద్రమంత్రులు, మా బిజెపి జాతీయనాయకులు మా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి హైదరాబాద్‌ వస్తుంటే వారి రాకను కూడా సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తప్పు పడుతున్నారు. ఇదేమి నిజాం రాజ్యం కాదు. రావద్దని చెప్పడానికి మీకు అధికారం లేదు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు శాస్వితమైన అధికారం కట్టబెట్టలేదని గుర్తుంచుకోవాలి. మజ్లీస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీ, స్వర్గీయ ప్రధాని పీవీ, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్న మాటలు వారి దూరంహంకారానికి అద్దం పడుతున్నాయి. వారికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. 


Related Post