ఎన్నికల కోసం నగరంలో చిచ్చుపెట్టొద్దు: కేటీఆర్‌

November 26, 2020


img

గత ఏడాది అక్టోబర్ నుంచి ఆర్టీసీ సమ్మె...ఆ తరువాత నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా లాక్‌డౌన్‌లతో స్తంభించిపోయి తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ నగరం మళ్ళీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంటే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో నగరం మళ్ళీ అల్లకల్లోలంగా మారింది. 

రాజకీయపార్టీలు అభివృద్ధి అజెండాగా ఎంతగా ఎన్నికల ప్రచారం చేసుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు...నగర ప్రశాంతతకు భంగం కలిగేది కాదు. కానీ బిజెపి,మజ్లీస్ పార్టీలు మద్యలో మతాన్ని కూడా తీసుకురావడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారంలో ‘పాతబస్తీలో 75,000 మంది రోహ్యింగాలకు, పాకిస్తానీలకు మజ్లీస్ పార్టీ ఆశ్రయం కల్పించిందని, టిఆర్ఎస్‌ ప్రభుత్వం మద్దతు లేకుండా వారికి ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదని తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపించి వారినందరినీ ఏరిపారేస్తామని’ తీవ్రంగా  హెచ్చరించడంతో ఈ సమస్య మొదలైందని చెప్పవచ్చు. ఆ ఆరోపణలను మజ్లీస్, టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అయితే మజ్లీస్ పార్టీ అంతటితో ఆగకుండా హుస్సేన్ సాగర్ ఒడ్డునున్న స్వర్గీయ పీవీ నరసింహారావు, స్వర్గీయ ఎన్టీఆర్ సమాధులను తొలగించాలంటూ రెచ్చగొట్టడంతో బిజెపి కూడా అందుకు ధీటుగా ప్రతిసవాల్ విసిరింది. ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.      

అయితే స్థానిక సమస్యలు, నగర అభివృద్ధి గురించి మాట్లాడకుండా సమాధులు కూల్చుకోవడం, బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులు, ఉగ్రవాదసంస్థల గురించి మాట్లాడవలసిన అవసరం ఏమిటని టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఇటువంటి మాటలతో మతవిద్వేషాలు రగిల్చి, ప్రజలను రెచ్చగొడితే హైదరాబాద్‌ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రశాంతతకు, ప్రతిష్టకు భంగం కలిగితే గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పడ్డ కష్టం అంతా వృదా అవుతుందని అన్నారు. నగరం ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని, అప్పుడే అభివృద్ధి జరిగి ప్రజలకు వాటి ఫలాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో పరిస్థితులు అదుపుతప్పితే దాంతో ఒక్క హైదరాబాద్‌ నగరానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కనుక రాష్ట్రం, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బిజెపి, మజ్లీస్‌ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం మతవిద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. ప్రజలు కూడా ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలకు లొంగిపోకుండా నిగ్రహం పాటించి తమ ఓటు హక్కును సద్వినియోగపరచాలని విజ్ఞప్తి చేసారు.

అయితే ప్రేమలోను, యుద్ధంలోను ఏదీ తప్పు కాదన్నట్లు ఈ ఎన్నికలలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఏదీ వెనక్కు తగ్గే ప్రసక్తే ఉండదు. కనుక ప్రజలే సంయమనం పాటిస్తూ విచక్షణతో మెలగడం చాలా అవసరం లేకుంటే దానికి అందరూ మూల్యం చెల్లించవలసిరావచ్చు. 


Related Post