.jpg) 
                                        జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అధికార టిఆర్ఎస్‌ను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొని గెలవలేమని భావిస్తున్న కొన్ని రాజకీయశక్తులు హైదరాబాద్ నగరంలో లేదా రాష్ట్రంలో ఏదో ఓ ప్రాంతంలో అల్లర్లు, మతఘర్షణలు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని, అటువంటి ఆరాచక, సంఘ విద్రోహక శక్తులను గుర్తించి ఉక్కుపాదంతో అణచివేయాలని సిఎం కేసీఆర్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. 
సిఎం కేసీఆర్ బుదవారం ప్రగతి భవన్‌లో పోలీస్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు, ఐజీలు, నిజామాబాద్, వరంగల్, ఐజీలు హాజరయ్యారు.
గత ఆరున్నరేళ్ళుగా ప్రభుత్వం, పోలీసులు చేపట్టిన పలుచర్యల వలన హైదరాబాద్‌లో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందని, కానీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కొన్ని రాజకీయశక్తులు ప్రజలను రెచ్చగొట్టి మత ఘర్షణలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఒకవేళ నగరంలో సాధ్యం కాకపోతే చుట్టుపక్కల జిల్లాలో అల్లర్లు, మతఘర్షణలు సృష్టించైనా ఈ ఎన్నికలను వాయిదా పడేలా చేయాలని కుట్రలు పన్నుతున్నట్లు ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉందని సిఎం కేసీఆర్ అన్నారు. కనుక హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నవారిని ఉపేక్షించనవసరం లేదని ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని సిఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాజకీయలబ్ది కోసం మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దని అటువంటి వారికి దూరంగా ఉండాలన్నారు.