దేశ ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా సిద్దం: కేసీఆర్‌

November 23, 2020


img

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో ఆవిష్కరణ సందర్భంగా తన జాతీయ రాజకీయ ప్రవేశం గురించి ఓ ఆసక్తికరమైన మాట చెప్పారు. “దశాబ్ధాలుగా దేశం సరైన మార్గంలో ముందుకు సాగడం లేదు. అందుకు కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాల లోపభూయిష్టమైన విధానాలే కారణం. తెలంగాణ ఆవిర్భవించిన ఆరున్నరేళ్ళలోనే సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచగలుగుతున్నాను. ఆ సంపదతో అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపాను. ఇటువంటి దూరదృష్టి, సరైన విధానాలు కలిగిన ప్రభుత్వాలు కేంద్రంలో కూడా ఉండి ఉంటే జాతీయస్థాయిలో కూడా ఇది సాధ్యమే. కానీ దురదృష్టవశాత్తు గత ఏడు దశాబ్ధాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలకు సరైన విధానం, దూరదృష్టి లేకపోవడం వలన దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయింది. కనుక దేశంలో ఓ సరికొత్త మార్గంలో నడిపించాల్సిన సమయం వచ్చింది. దేశం కోసం ఓ సరికొత్త రాజకీయ ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం పట్ల నాకు ఎంత బాధ్యత ఉందో ఓ భారతీయుడిగా దేశం పట్ల, దేశప్రయోజనాల పట్ల కూడా అంతే బాధ్యత ఉందని భావిస్తున్నాను. కనుక దేశప్రయోజనం కోసం ఓ నూతనమార్గం ఆవిష్కరించేందుకు నేను ఎటువంటి త్యాగానికైనా సిద్దం. ఇప్పటికే ఈ విషయం గురించి వివిద రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయపార్టీల అధినేతలతో, ముఖ్యమంత్రులతో లోతుగా చర్చించాను. త్వరలోనే దానిపై అడుగుముందుకు వేస్తాను. నేను ఒకసారి అడుగు ముందుకువేస్తే ఇక వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదని అందరికీ తెలుసు. నా ఈ రాజకీయ ప్రయోగంపై చిల్లరగాళ్ళు అనేక మాటలు మాట్లాడవచ్చు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతాను,” అని అన్నారు. 

కేంద్రప్రభుత్వానికి సరైన విధానం, ఆలోచనా లేనందునే ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటివాటిని అమ్ముకొంటోందని సిఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే నెలాఖరులోగా హైదరాబాద్‌లో దేశంలో ప్రధానరాజకీయపార్టీల అధినేతలతో సమావేశమయ్యి ఈ అంశంపై చర్చిస్తానని సిఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. కనుక సిఎం కేసీఆర్‌ జాతీయరాజకీయలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు. ‘దేశ ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా సిద్దమే’ అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమనుకోవలసి ఉంటుంది. ఒకవేళ అదే అయితే కేటీఆర్‌ ఆ పదవిని చేపట్టడం తధ్యం.                   


Related Post