కేటీఆర్‌ ప్రసంగం అదుర్స్

November 23, 2020


img

మంత్రి కేటీఆర్‌ అద్భుతమైన వాక్చాతుర్యం, అందరినీ ఆకట్టుకొనేవిధంగా సరళమైన బాషలో అనర్గళంగా ప్రసంగించే నేర్పు గురించి అందరికీ తెలిసిందే. ఇవాళ్ళ బంజారాహిల్స్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌బాడీ మీటింగుకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ వారిని ఉద్దేశ్యించి చాలా అద్భుతంగా ప్రసంగించారు. 

ప్రజలందరూ తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని చెపుతూ, “హైదరాబాద్‌ నగరంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా 45-48 శాతం మాత్రమే ఓటింగ్ నమోదవుతుందనే ఓ చెడ్డపేరుంది. అదే మారుమూల గ్రామాలలో 85-87 శాతం పోలింగ్ నమోదవుతుంది. వారికున్న చైతన్యం నగరవాసులకు ఎందుకు లేదు? అని ప్రశ్నిస్తున్నాను. మన నగరం, మన రాష్ట్రం బాగుపడాలంటే మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం చాలా అవసరం. ఓటు వేసి ఆ ప్రజాప్రతినిధి పనిచేయకపోతే తప్పకుండా విమర్శించవచ్చు. కానీ ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని కానీ ఓట్లు వేయకుండా సోషల్ మీడియాలో కూర్చొని ప్రభుత్వం పనిచేయడం లేదంటూ విమర్శలు చేసేవాళ్ళే ఎక్కువ. దాని వలన ఏమి లాభం? ఓటు వేయనివారికి అలా ప్రశ్నించే హక్కు ఉంటుందా? 

నేను టిఆర్ఎస్‌ ప్రతినిధిగా మా పార్టీకి ఓట్లు వేయమని మిమ్మల్ని అడిగేందుకు ఇక్కడకు వచ్చాను. మేము గత ఆరేళ్ళలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం. ఆ హక్కుతోనే మిమ్మల్ని ఓటేయమని కోరుతున్నాను. ఎన్నికల సమయంలో వివిద పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తుంటాయి కనుక అందరూ కొంత గందరగోళానికి గురవడం సహజం. అయితే ఆరేళ్ళకు మునుపు మన హైదరాబాద్‌ పరిస్థితి ఎలా ఉండేది?ఇప్పుడు ఎలా ఉంది?అని బేరీజు వేసుకొని చూడండి. అలాగే నేను చెపుతున్నట్లు మా ప్రభుత్వం నగరాన్ని నిజంగా అభివృద్ధి చేస్తోందా లేదా? ప్రజా సమస్యలను పరిష్కరిస్తోందా లేదా? అని అందరూ ఓసారి కూర్చొని ఆలోచించండి. ఒకవేళ నేను చెపుతున్నావన్నీ నిజమేనని భావిస్తే టిఆర్ఎస్‌కు ఓట్లు వేసి గెలిపించండి. కాదని భావించినా ఓటు వేయడం మానొద్దు. వేరే పార్టీకో లేదా కనీసం ‘నోటా’ కో ఓట్లు వేసి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. అప్పుడే మన ప్రజాస్వామ్యానికి అర్ధం ఉంటుంది,” అని అన్నారు.


Related Post