 
                                        ఒకప్పుడు దేశంలో రాజకీయ నాయకులు బిజెపిని అంటరానిపార్టీగా భావించేవారు కనుక ఎవరూ ఆ పార్టీలో చేరేవారు కారు. అలాగే బిజెపి కూడా తన హిందుత్వ సిద్దాంతానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఇతర పార్టీల నేతలను చేర్చుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపేది కాదు. ఆ కారణంగా ఇంతకాలంగా తెలంగాణలో రాజకీయనేతలు కాంగ్రెస్, టిఆర్ఎస్‌ల మద్యే పార్టీలు మారుతుండేవారు. కానీ ఇప్పుడు బిజెపి నేతలే స్వయంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతల ఇళ్ళకు వెళ్ళి తలుపులు తట్టి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బిజెపిలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో బిజెపి బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. 
మరైతే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్ నావ మునిగిపోతున్నా కెప్టెన్ పదవి కోసం నేతలు కీచులాడుకొంటునే ఉన్నారు. ఎవరికి ఆ పదవి ఇచ్చిన మిగిలినవారు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. బహుశః ఈ భయాలతోనే ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగిస్తున్నట్లుంది. కనుక కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని బలహీనతతో కాంగ్రెస్ ఆగమ్యగోచరంగా ముందుకు సాగుతోంది.
ఇక జాతీయస్థాయి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంచుమించు ఇదే అయోమయం నెలకొని ఉంది. వైద్యుల సూచన మేరకు సోనియా గాంధీ గోవా వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చెప్పట్టడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ సిద్దపడినా సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రియాంకా వాద్రా కూడా ఆసక్తి చూపడం లేదు. గాంధీ కుటుంబం తప్ప మరొకరు పగ్గాలు చేపట్టకూడదనే ‘కనబడని నియమం’ పార్టీలో సీనియర్లను వెనుకంజవేసేలా చేస్తోంది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ముందుకువచ్చినా వారు అధిష్టానంపై తిరుగుబాటు చేస్తున్నట్లుగా లెక్కకట్టేస్తారు.
ఈనేపధ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తమ నేతల తీరును, పార్టీ పరిస్థితిని, భవిష్యత్‌ను కళ్ళకు కట్టినట్లు వివరించారు. “కాంగ్రెస్ నాయకులకు ప్రజలలోకి వెళ్ళి పనిచేసే అలవాటు ఎప్పుడో పోయింది. ఎంతసేపు ఏసీ రూంలలో మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. పార్టీ టికెట్ లభించగానే ఫైవ్ స్టార్ హోటల్స్ లో మీడియా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. ఏసీ గదులు వదిలి ప్రజలలోకి రాకపోతే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలలోనూ గెలిచే అవకాశం ఉండదు. జాతీయస్థాయి నాయకత్వం (సోనియా, రాహుల్ గాంధీ) ధోరణిలో తక్షణం మార్పు అవసరం. అప్పుడే క్రింద స్థాయి నాయకులలో కూడా మార్పు వస్తుంది,” అని అన్నారు.
కాంగ్రెస్‌లో ప్రక్షాళన అంటే అటువారిని ఇటు, ఇటువారిని అటు పదవులు మార్చి సరిపెట్టడమే తప్ప సమర్ధులైన యువ నాయకులను గుర్తించి వారికి అవకాశం కల్పించడం జరుగదు. పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నా నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూనే ఉంటారు. సమన్వయలోపం, కలిసికట్టుగా పనిచేయలేకపోవడం, ఆజాద్ చెప్పినట్లు ప్రజలలోకి వెళ్ళి పనిచేయలేకపోవడం వంటి అవలక్షణాలు చాలానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌కున్న ‘సెక్యులర్ ముద్ర’ కారణంగా నేటికీ దానికి దేశవ్యాప్తంగా బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అదే దానిని ఇంకా కాపాడుతోంది. కానీ గత రెండు మూడు దశాబ్ధాలుగా ఎక్కడిక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి బలపడుతుండటంతో కాంగ్రెస్ బలహీనపడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అందుకు ప్రత్యక్ష నిదర్శనం. కనుక జాతీయస్థాయి నాయకత్వంలో మార్పు జరిగి, ఈ అవలక్షణాలన్నిటినీ వదిలించుకోవలసిన అవసరం చాలా ఉంది లేకుంటే ఆ సెక్యులర్ ముద్ర కూడా కాంగ్రెస్ పార్టీని ఇక ఎంతో కాలం కాపాడలేదు.