టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలం: మజ్లీస్‌

November 23, 2020


img

‘మజ్లీస్‌ పార్టీ మా పక్కా దోస్త్’ అని సిఎం కేసీఆర్‌ స్వయంగా అనేకసార్లు శాసనసభలో, బయటా కూడా చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందు మజ్లీస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. కానీ ఇప్పుడు మా మద్య ఎటువంటి స్నేహం లేదని ఆ రెండు పార్టీలు అవసరమైన దాని కంటే బిగ్గరగా చెప్పుకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా ఆ రెండు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకొంటున్నారు. 

మజ్లీస్‌ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మరో అడుగు ముందుకు వేసి తాము తలుచుకొంటే టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని రెండు నెలలో కూల్చివేయగలమంటూ హెచ్చరించారు. ఛార్మినార్ పరిదిలో నిన్న ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మజ్లీస్‌ పార్టీ ఎన్నో పార్టీలను, ఎంతోమంది నాయకులను చూసింది. వాటిలో టిఆర్ఎస్‌ కూడా ఒకటి. మాకు ఎవరినైనా కుర్చీలో కూర్చోపెట్టడం వచ్చు అలాగే తలుచుకొంటే దించేయడం కూడా వచ్చు. మాకు ఇదేమి కొత్తకాదు. మేము తలుచుకొంటే టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలము. రాజకీయాలు మా ఇంట్లో గుమాస్తా వంటివి. మంత్రి కేటీఆర్‌ నిన్నమొన్న కళ్ళు తెరిచిన కొత్త చిలుక. ఆయన మాకో లెక్క కాదు,” అని అన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందు వరకు జిగిరీ దోస్తులుగా ఉన్న టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని కూల్చివేసుకోనేంత శత్రువులుగా మారిపోయంటే నమ్మశక్యంగా లేదు.  అయితే అవి శత్రువులులా ఎందుకు నటిస్తున్నాయి? అంటే అందుకు చాలా బలమైన కారణమే కనిపిస్తోంది. 

బిజెపిని మతతత్వ పార్టీ అని నిందిస్తున్న టిఆర్ఎస్‌, మతతత్వ పార్టీ అయిన మజ్లీస్‌తో చేతులు కలిపి నగరంలో ముస్లిం ఓటర్లను బుట్టలో వేసుకొని గెలవాలని చూస్తోందని, ఆ రెండు పార్టీలే మతరాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిజెపి నేతలందరూ కూడా టిఆర్ఎస్‌-మజ్లీస్ బందం గురించే ఎన్నికల ప్రచారంలో గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతో నగరంలో హిందూ ఓటర్లు బిజెపివైపు మళ్ళితే టిఆర్ఎస్‌ నష్టపోతుంది. బహుశః అందుకే మజ్లీస్‌తో తమకు ఎటువంటి సంబందమూ లేదని టిఆర్ఎస్‌, దాని వాదనలు నిజమని ప్రజలను నమ్మించేందుకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ వంటి నేతలు టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నట్లు భావించవచ్చు. కానీ డిసెంబర్‌ 4న ఫలితాలు వెలువడగానే మళ్ళీ రెండు పార్టీలు ఒకటైపోతాయని బిజెపి నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు.


Related Post