వరదసాయం ఎవరు ఆపారు?

November 19, 2020


img

హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగకు ముందు రూ.530 కోట్లు నిధులు విడుదల చేసింది. అయితే ఆ సొమ్ము పంపిణీలో అవకతవకలు జరుగడంతో మద్యలో కొన్ని రోజులు పంపిణీ నిలిపివేసింది. ఆ తరువాత వరద బాధితులు మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించుకోవాలని ప్రభుత్వం సూచించడంతో గత మూడు,నాలుగు రోజులుగా వేలాదిమంది ప్రజలు మీ-సేవా కేంద్రాలవద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. 

ఒకేసారి అంతమంది తరలిరావడంతో మీ-సేవా కేంద్రాలపై ఒత్తిడి పెరగడంతో అవి కూడా సమర్ధంగా వరదసాయం దరఖాస్తులను స్వీకరించలేకపోయాయి. ఈలోగా ఎన్నికల సంఘం హడావుడిగా 17వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించడంతో నగరంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దాంతో వరదసాయం పంపిణీ నిలిపివేయవలసిందిగా ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. 

అయితే బిజెపియే ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరదసాయం నిలిపివేయించిందని, తద్వారా పేదల నోటికాడ కూడు లాక్కొందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఆయన ఆరోపణలను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. వరదసాయం నిలిపివేయాలని తాను ఎన్నికల సంఘానికి లేఖ వ్రాసినట్లు నిరూపించాలని సిఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంతో ఈ ఎన్నికలలో కూడా బిజెపి చేతిలో ఓడిపోతామనే భయంతోనే సిఎం కేసీఆర్‌ తమపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

వరద బాధితులకు ఆర్ధికసాయం అందించడం ద్వారా వారిని ఆదుకోవాలని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించిన మాట వాస్తవం. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొనే వరదసాయం ప్రకటిచిందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వరదలు, భారీ వర్షాలతో అల్లాడిపోయిన ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గుర్తించిన టిఆర్ఎస్‌ ప్రభుత్వం వారికి వరదసాయం అందించడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలనుకొంది. ఈ విషయంలో టిఆర్ఎస్‌ ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. దాని ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కనుక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ‘బిజెపి వలననే వారికి వరదసాయం అందలేదనే’ సరికొత్త వాదనతో బిజెపిని దోషిగా నిలబెట్టి టిఆర్ఎస్‌ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. 

అయితే దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ నిలిపివేయవలసి ఉంటుందని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏ రూపంలో లేదా ఏ పేరుతో గానీ ప్రజలకు డబ్బు పంపిణీ చేయడం ఎన్నికల నిబందనలకు విరుద్దం కనుకనే వరదసాయం పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది తప్ప తెలంగాణ ప్రభుత్వమో లేదా బిజెపియో ఆపడం వలన నిలిచిపోలేదు.


Related Post