అమ్మ పెట్టదు...అడుక్కొని తిననివ్వదు: సిఎం కేసీఆర్‌

November 18, 2020


img

సిఎం కేసీఆర్‌ బుదవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యి వారికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కరోనా... లాక్‌డౌన్‌లతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆడుకొనేందుకు మన ప్రభుత్వం వరదసాయం అందిస్తుంటే చూసి ఓర్వలేని బిజెపి ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని దానిని నిలిపివేయించి పేదలనోటికాడ కూడును కొట్టేసింది. బిజెపి కారణంగా ఇప్పుడు వరదసాయం నిలిపివేసినా, ఎన్నికలవగానే మళ్ళీ ప్రతీ ఒక్కరికీ తప్పకుండా అందిస్తాము.   రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకొనేందుకు నిధులు విడుదల చేయమని కేంద్రానికి లేఖ వ్రాసినా పట్టించుకోలేదు. ఇంతవరకు దమ్మీడీ విదిలించలేదు. కేంద్రం ఇవ్వకపోయినా మన ప్రభుత్వం వరదబాధితులను ఆదుకొంటుంటే ‘అమ్మ పెట్టదు...అడుక్కొని తిననివ్వదన్నట్లు’ దానినీ అడ్డుకొంది. 

ఈ ఎన్నికలలో 110 సీట్లు గెలుచుకోబోతోంది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. ఇవాళ్లే అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తాను. ఆ జాబితాలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి. అర్హులైన అందరికీ స్థానం లభిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇవ్వలేకపోయినా వారికి తప్పకుండా ఏదోవిధంగా న్యాయం చేస్తాను. కనుక టికెట్ దక్కనివారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

జిఎస్టీలో రాష్ట్రానికి న్యాయంగా రావలసిన డబ్బును కూడా చెల్లించకుండా ఎగవేస్తున్నా రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రంలో అమలవుతున్న పధకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందంటూ నిసిగ్గుగా అబద్దాలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. బిజెపి నేతలు చేస్తున్న ఈ అబద్దపు ప్రచారాలను జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఎండగట్టి ప్రజలకు బిజెపి అసలు స్వరూపం తెలియజేయాలి. అలాగే మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల గురించి కూడా ప్రజలకు తెలియజేయవలసిన సమయం వచ్చింది. వచ్చేనెల రెండో వారంలో హైదరాబాద్‌లోనే దేశంలో అన్ని ప్రధాన ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహిస్తాను. ఆ సమావేశానికి మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరవుతారు. అందరం కలిసి హైదరాబాద్‌ నుంచే మోడీ ప్రభుత్వంతో యుద్ధం మొదలుపెడతాము,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 


Related Post