వరద సాయానికి ఎన్నికల సంఘం బ్రేక్

November 18, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వరద సాయానికి ఊహించినట్లే ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినందున నిన్నటి నుంచే నగరంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, కనుక ఇంటికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న వరదసాయాన్ని తక్షణం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదసాయం కోసం మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరణ, పంపిణీని కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డిసెంబర్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మళ్ళీ యధాప్రకారం వరదసాయం పంపిణీ చేసుకోవచ్చునని తెలిపింది. 

గత రెండు మూడు రోజులుగా మీసేవాకేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడున్న హైదరాబాద్ ప్రజలకు ఇది చాలా నిరాశ, తీవ్ర ఆగ్రహం కలిగించే విషయమే. కానీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమీ చేయలేదని గ్రహించి, ఫలితాలు వెలువడేవరకు ఓపికగా ఎదురుచూడక తప్పదు. నగరంలో 4 లక్షలమందికిపైగా వరద సాయం అందింది. ఇంకా లక్షలమందికి అందకపోవడంతో వారందరూ తీవ్ర నిరాశనిస్పృహలతో ఉన్నారు. వారందరూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటువంటి సమయంలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులు వారివద్దకు వెళ్ళి ఓట్లు అడగవలసివస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్ళడం తొందరపాటుగానే కనిపిస్తోంది. దీంతో టిఆర్ఎస్‌ నష్టపోతుందా లేదా వారికి నచ్చజెప్పుకొని మళ్ళీ జీహెచ్‌ఎంసీ పీఠాన్ని దక్కించుకొంటుందా? ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొనున్న ఈ అసంతృప్తి, అసహనాలను కాంగ్రెస్‌, బిజెపిలు తమకు అనుకూలంగా మార్చుకొని లబ్ది పొందుతాయా లేదా?అనేది డిసెంబర్‌ 4వ తేదీన తేలిపోతుంది.


Related Post