మీ-సేవా కేంద్రాలవద్ద బారులు తీరిన జనం

November 18, 2020


img

హైదరాబాద్‌ వరద బాధితులకు నగదు పంపిణీలో అవకతవకలు జరుగడంతో మీ-సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దాంతో గత రెండుమూడు రోజులుగా నగరంలో ఎక్కడ చూసినా వేలాదిమంది ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడ్డారు. కానీ ఒకేసారి వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో మీ-సేవా కేంద్రాలతో అనుసంధానమైన కంప్యూటర్ సర్వర్లు హ్యాంగ్ అయిపోతున్నాయి. దాంతో మీ-సేవా కేంద్రాలపై ప్రజల ఒత్తిడి ఇంకా పెరిగిపోసాగింది. ఆ ఒత్తిడి భరించలేని మీ-సేవా నిర్వాహకులు తలుపులు మూసేస్తున్నారు. అయినా కూడా చాలా మంది ప్రజలు పిల్లాపాపాలతో సహా తరలివచ్చి గంటలతరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారు. 

నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మీ-సేవా కేంద్రాల వద్ద కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కొంతమంది తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి క్యూ కాసినప్పటికీ సర్వర్లు పనిచేయకపోవడంతో గంటలతరబడి వేచి ఉండవలసివస్తోంది. నగరంలో కొన్ని మీ-సేవా కేంద్రాలలో తొక్కిసలాటలు కూడా జరిగాయి వాటిలో కొంతమంది గాయపడ్డారు కూడా. చాలామంది మహిళలు చిన్న పిల్లలను, చంటిపిల్లలను వెంటబెట్టుకొని వచ్చి గంటలతరబడి క్యూలైన్లో నిలబడుతున్నారు. వరదసాయం అందకపోగా దాని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈవిధంగా రోడ్లపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడవలసి వస్తున్నందుకు ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తక్షణమే అందరికీ వరద సాయం అందేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 


వరదసాయం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు భారీగా ప్రజలు తరలివస్తుండటంతో మళ్ళీ కరోనా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. గంటలతరబడి క్యూలైన్లో నిలబడుతున్న ప్రజలు అంతసేపు మాస్కూలు ధరించలేక, భౌతికదూరం పాటించలేకపోతున్నారు. చిన్నారులు, పాలు త్రాగే పసిపిల్లలు, వృద్ధులు, బీపీ…డయాబెటీస్ వంటి దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ముఖ్యంగా జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలున్నవారు మీ-సేవా కేంద్రాలవద్ద గుమిగూడటం చాలా ప్రమాదకరం అని అందరికీ తెలుసు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ ప్రజలకు వరద కష్టాలు కూడా తోడవడంతో ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 ఆర్ధికసాయం కోసం ఆశగా మీ-సేవాకేంద్రాలకు తరలివస్తున్నారు. 

ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌ నగరంలో కరోనా నియంత్రణలోకి వస్తోంది. కానీ ఈ జనసమూహాలతో మళ్ళీ కరోనా విస్పోటనం చెందే ప్రమాదం పొంచి ఉంది. అదీగాక వరదసాయం కోసం మీ-సేవాకేంద్రాల వద్ద పడిగాపులుగాసినా సాయం అందనివారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో డిసెంబర్‌ 1న జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వరదబాధితులకు ఆర్ధికసాయం అందించడం మంచిది.


Related Post