కాంగ్రెస్‌, బిజెపిలు టిఆర్ఎస్‌ ఉచ్చులో చిక్కుకొన్నాయా?

November 18, 2020


img

కాంగ్రెస్‌, బిజెపిలను దుబ్బాక ఉపఎన్నికలపైనే ఎక్కువగా దృష్టిపెట్టేలా చేసి వాటిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి ఆలోచించనీయకుండా టిఆర్ఎస్‌ చేసిందా?అంటే అవుననే అనిపిస్తోంది. నవంబర్‌ రెండవ వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని మంత్రి కేటీఆర్‌ ముందే చెప్పారు. అయినా కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆయన మాటలను పెద్దగా పట్టించుకోకుండా దుబ్బాక ఉపఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. 

దుబ్బాకలో టిఆర్ఎస్‌ గెలిచి ఉండి ఉంటే ఆ పార్టీకి చాలా మేలు కలిగేది కానీ ఓడిపోయినా పెద్దగా నష్టపోదు. కానీ 24 శాసనసభ నియోజకవర్గాలున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోతే చాలా తీవ్రంగా నష్టపోతుంది. కనుక కాంగ్రెస్‌, బిజెపిలకు దుబ్బాకను ఎరగా వేసి అటువైపు మళ్లించినట్లు భావించవచ్చు. దుబ్బాకలో మంత్రి హరీష్‌రావుతో గట్టిగా ప్రచారం చేయించడం ద్వారా కాంగ్రెస్‌, బిజెపిలను అటువైపు మళ్లించగలిగింది. అదే సమయంలో హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అంతా చక్కబెట్టేసారు. కనుక ఈ ఎన్నికలకు టిఆర్ఎస్‌ సర్వం సిద్దంగానే ఉన్నట్లు భావించవచ్చు. 

మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించి వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టేసింది. నేటితో నామినేషన్ల గడువులో ఒకరోజు ముగిసిపోతుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో కాంగ్రెస్‌, బిజెపిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయిప్పుడు. ఒకవైపు ఆశావాహుల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు, టికెట్ల కోసం నేతలు, కార్యకర్తల నిరసన దీక్షలను ఎదుర్కొంటూనే మిగిలిన ఈ రెండు రోజులలోనే గెలుపుగుర్రాలను ఎంపికచేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఒకవేళ సమయం తక్కువగా ఉన్నందున హడావుడిగా అభ్యర్ధుల ఎంపిక చేసి నిలబెట్టినా ఫలితం ఉండకపోగా మళ్ళీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే టిఆర్ఎస్‌ వ్యూహాలను పసిగట్టడంలో ఆ రెండు పార్టీలు విఫలమైనందునే వాటికి నేడు ఈ సమస్య ఎదురైందని చెప్పక తప్పదు. కనుక టిఆర్ఎస్‌ విసిరిన దుబ్బాక ఉచ్చులో చిక్కుకొన్న కాంగ్రెస్‌, బిజెపిలు మిగిలిన ఈ రెండు రోజులలోనే గెలుపు గుర్రాలను గుర్తించి, బరిలో దించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఎదుర్కోగలవా లేదో డిసెంబర్‌ 4వ తేదీన ఫలితాలు వెలువడినప్పుడు తేలిపోతుంది.


Related Post