టిఆర్ఎస్‌ దూకుడు...వైసీపీ వెనకడుగు

November 18, 2020


img

తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ ఎన్నికలంటే సమరోత్సాహంతో ఉరకలు వేస్తుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికలలో వీరోచితంగా పోరాడి ఓడినప్పటికీ ఏమాత్రం భయపడకుండా వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్దమై ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ఉవ్విళ్ళూరుతోంది. 

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఒకప్పుడు ఇలాగే ఎప్పుడూ సమరోత్సాహంతో ఉండేది. ఈ ఏడాది మార్చి నెలలో స్థానికసంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకంజవేయకుండా దూసుకుపోయింది. 

కానీ కరోనా కారణంగా ఆ ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడిన తరువాత ఏపీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యక్ష యుద్దాలు జరిగాయి. వాటన్నిటిలో నిమ్మగడ్డే గెలిచారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో బిహార్‌ శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జోరుగా శాసనసభ ఉపఎన్నికలు జరిగాయి. డిసెంబర్‌ 1వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఏపీలో కూడా వాయిదాపడిన స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. 

రాష్ట్రంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరుగుతున్నందున పోలీసులు, ప్రభుత్వోద్యోగులలో పలువురు కరోనా కట్టడిలో తీరిక లేకుండా ఉన్నారని కనుక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేవని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఓ లేఖ వ్రాశారు. పొరుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఏపీలో కూడా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదని వ్రాశారు. ఈవిషయంలో పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని ఆమె సూచించారు. 

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ టిడిపికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నందున ఆయన నేతృత్వంలో ఎన్నికలు జరిగితే నష్టపోతామని వైసీపీ భావిస్తోందనేది బహిరంగ రహస్యం. కనుక ఆయన పదవీ విరమణ చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈవిషయం లిఖితపూర్వకంగా ఆయనకు చెప్పలేదు కనుకనే కరోనా సాకును చూపి ఎన్నికల వాయిదా కోరుతున్నట్లు అర్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలకు అంగీకరించదని ముందే స్పష్టమవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఇవాళ్ళ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి పరిస్థితి వివరించనున్నారు. మరి గవర్నర్‌ ఏమి నిర్ణయిస్తారో చూడాలి.


Related Post