అభ్యర్ధులు ఖరారుకాక మునుపే నామినేషన్స్ షురూ

November 18, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం వరకు గడువు ఉంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వారం రోజుల తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడం ఆనవాయితీ కనుక రాజకీయపార్టీలు షెడ్యూల్ కోసం ఎదురుచూస్తూ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ఇంకా మొదలుపెట్టలేదు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న నేరుగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అన్ని పార్టీలు నిన్నటి నుండి హడావుడిగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టాయి. 

దీనిపై ఇప్పటికే కొంచెం కసరత్తు చేసిన బిజెపి ఇవాళ్ళ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న నోటిఫికేషన్‌ వెలువడగానే హడావుడిగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. ఇవాళ్ళ సాయంత్రంలోగా తొలి జాబితాను ప్రకటించవచ్చునని తెలుస్తోంది. 

టిఆర్ఎస్‌ సిట్టింగ్ కార్పొరేటర్లలో మెరుగైన పనితీరు కనబరిచినవారికే మళ్ళీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనుక సుమారు 60-75మంది అభ్యర్ధుల పేర్లు ఖరారు అయినట్లే భావించవచ్చు. ఈ ఎన్నికలలో టిడిపి కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే జనసేన కూడా పోటీ చేయబోతోందని పవన్‌ కల్యాణ్‌ నిన్ననే ప్రకటించారు. నామినేషన్లు వేసేందుకు శుక్రవారం వరకే గడువు ఉన్నందున ఇవాళ్ళ రేపటిలోగా అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించడం ఖాయం. 


Related Post