జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో జనసేన కూడా పోటీ... అందుకేనా?

November 17, 2020


img

డిసెంబర్‌ 1వ తేదీన జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతోందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. “రాష్ట్రంలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో చురుకుగా పనిచేస్తున్న మా జనసేన కార్యకర్తలు, నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడం చాలా అవసరమని వారు భావించారు. కనుక వారి అభీష్టం మేరకు ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతోందని తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ చురుకుగా సాగుతోంది. జనసేనకు బలం ఉన్న డివిజన్లలలో అభ్యర్ధులను నిలబెట్టి పోటీ చేస్తాము,” అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. 

రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికలలోనూ పాల్గొననని కారణంగా జనసేన తన ఉనికిని చాటుకోలేకపోయింది కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో జనసేన పోటీ చేయడం విచిత్రం కానప్పటికీ ఆశ్చర్యకరమే అని చెప్పక తప్పదు. అయితే హటాత్తుగా జనసేన ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. 

జనసేన, బిజెపిలకు స్నేహం ఉంది కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనసేన పోటీ చేయాలనుకోవడం బిజెపి ఎన్నికల వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో కూడా మళ్ళీ టిఆర్ఎస్‌ను దెబ్బ తీసి తమ సత్తాను మరోసారి చాటుకోవాలని చాలా పట్టుదలగా ఉన్న రాష్ట్ర బిజెపి నేతలే జనసేనను కూడా బరిలో దించినట్లు భావించవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బిజెపికి తగినంతమంది అభ్యర్ధులు లేరని టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఆ లోటును జనసేన అభ్యర్ధులు భర్తీ చేయగలరు. జనసేన కూడా పోటీలో దిగుతోంది కనుక బిజెపి, జనసేన అభ్యర్ధుల తరపున పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే జనసేన అభ్యర్ధులు, దాని అధినేత పవన్‌ కల్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఓటర్లపై ఏమేరకు ప్రభావం చూపగలుగుతారో...బిజెపికి ఏ మేరకు లబ్ధి కలిగించగలరో త్వరలోనే తెలుస్తుంది. 


Related Post