జీహెచ్‌ఎంసీలో 80 సీట్లు గెలుస్తాం: రఘునందన్ రావు

November 17, 2020


img

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి సత్తా ఏమిటో టిఆర్ఎస్‌కు రుచి చూపించాం. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మరోసారి రుచి చూపించబోతున్నాం. ఈ ఎన్నికలలో కనీసం 80 నుంచి 85 సీట్లు గెలుచుకొంటామని భావిస్తున్నాను,” అని అన్నారు. 

దుబ్బాక ఉపఎన్నికలకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు చాలా తేడా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దుబ్బాక కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలున్నాయి. అంటే ఇవి మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ వంటివే. ఒకప్పుడు బిజెపికి హైదరాబాద్‌లో మంచిపట్టు ఉన్న మాట వాస్తవం. కానీ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం సాధించినప్పటి నుంచి హైదరాబాద్‌పై తన పట్టు పెంచుకొని బిజెపి ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేసింది. పైగా మజ్లీస్ పార్టీతో  స్నేహం వలన నగరంలోని ముస్లింల ఓట్లు టిఆర్ఎస్‌కే పడే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల కారణంగా చాలా బలహీనపడి ఉంది. కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టిఆర్ఎస్‌ను ఓడించడం సంగతి పక్కనపెడితే దానిని ఎదుర్కోవడానికే చాలా చెమటోడ్చక తప్పదని చెప్పవచ్చు.   

అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు కూడా కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోలేకపోవడం, వరద సాయం సొమ్ము పంపిణీలో అవకతవకలు జరుగడం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పంపిణీలో టిఆర్ఎస్‌ మాట నిలబెట్టుకోలేకపోవడంవంటి కొన్ని అంశాలు టిఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా...టిఆర్ఎస్‌ కార్పొరేటర్ల పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న కార్పొరేటర్లను టిఆర్ఎస్‌ పక్కనపెడితే వారు టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.


Related Post