ప్రతిపక్షాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్

November 17, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబందించి అధికార టిఆర్ఎస్‌కు ముందే ఖచ్చితమైన సమాచారం తెలుసనేది బహిరంగ రహస్యమే. సుమారు నెలరోజుల క్రితం మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లే ఇవాళ్ళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటమే అందుకు ఓ నిదర్శనంగా భావించవచ్చు. అధికారపార్టీకి ఆ మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది కనుక దానిని తప్పుగా భావించలేము. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగబోతున్నాయో టిఆర్ఎస్‌కు ముందే తెలుసు కనుక ఈపాటికి అభ్యర్ధుల ఎంపికతో సహా అన్ని చక్కబెట్టుకొని రేపటి నుంచి ప్రచారానికి సిద్దపడినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే సమాచారం ఉండదు కనుక వాటికి ఈరోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చు. 

సాధారణంగా మొదట ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంటుంది ఎన్నికల సంఘం. కనుక ఆలోగా అభ్యర్ధులను ఖరారు చేసుకొనేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది. కానీ ఆ ఆనవాయితీని పక్కన పెట్టి ఇవాళ్ళ నేరుగా నోటిఫికేషన్‌ ప్రకటించేసి రేపటి నుంచి శుక్రవారంలోగా నామినేషన్లు దాఖలు చేయాలని గడువు ప్రకటించడం ప్రతిపక్షాలకు పెద్ద షాక్ అనే చెప్పకతప్పదు. 

నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయిన తరువాత అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేసుకొని వాటిపై చర్చించడం, వారిలో అభ్యర్ధులను ఖరారు చేసుకోవడం, ఎంపికైన అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు అన్ని పత్రాలు సిద్దం చేసుకోవడం వగైరా అన్నీ కూడా కొంత సమయం తీసుకొనేవే. కేవలం మూడు రోజులలో ఈ ప్రక్రియ అంతా పూర్తిచేయవలసి ఉన్నందున అభ్యర్ధుల ఎంపికలో తప్పులు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దాంతో వారి విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు పెద్ద షాక్ వంటిదేనని చెప్పక తప్పదు. కనుక ప్రతిపక్షాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ హైకోర్టు వాటి అభ్యర్ధనను తిరస్కరిస్తే ఎన్నికలకు ముందే అవి సగం ఓడిపోయినట్లే భావించవచ్చు. 


Related Post