బిజెపి గురించి రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే...

November 17, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి రాష్ట్ర బిజెపిపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో గెలవగానే రాష్ట్రంలో ఇక తమకు తిరుగులేదని బిజెపి నేతలు పగటికలలు కంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నటికీ బిజెపి బలపడలేదు. కాంగ్రెస్‌ స్థానంలోకి రాలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో నిలబెట్టేందుకు బిజెపి వద్ద తగినంతమంది అభ్యర్ధులు కూడా లేరు. మరి ఎలా గెలుస్తామనుకొంటున్నారు? దుబ్బాకలో చావు తప్పి కన్నులొట్టపోయినట్లు గెలిచిన బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఎవరి బలం ఎంతో తేలిపోతుంది. 

నిజానికి టిఆర్ఎస్‌, బిజెపిల బందం పాలు, నీళ్ళ వంటిదే. అందుకే హైదరాబాద్‌లోవరదబాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పల్లెత్తుమాట అనలేదు. బహుశః అందుకేనేమో ‘కిషన్ రెడ్డి జంటిల్ మ్యాన్’ అని సిఎం కేసీఆర్‌ మెచ్చుకొన్నట్లున్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతిలో డిజాస్టర్ మేనేజిమెంట్ ఉంది. కానీ ఆయన దానిని హైదరాబాద్‌ వరదబాధితులను ఆడుకోవడానికి వినియోగించలేదు. అంటే హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి అధికారం పనిచేయదా? పనిచేయకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆయనను గట్టిగా ఎందుకు నిలదీయలేదు?తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని బిజెపి నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. సాక్షాత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వారి పక్కనే ఉన్నప్పటికీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు?ఇవన్నీ టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహనకు నిదర్శనాలు కావా?” అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 


Related Post