టి-కాంగ్రెస్‌కు హైకోర్టు మొట్టికాయలు

November 17, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టుకు వెళ్ళిన కాంగ్రెస్‌ పార్టీకి గట్టిగా మొట్టికాయలు పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ దురుదేశ్యంతో ఎన్నికలను అడ్డుకొనేందుకు ఈ పిటిషన్‌ వేసిందని, ఇది మంచి పద్దతి కాదని  హైకోర్టు మందలించింది. బీసీ రిజర్వేషన్ల సమస్య గత ఆరేళ్ళుగా ఉందని దానిపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందే పిటిషనర్‌ (కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్)కు ఈవిషయం గుర్తుకురావడానికి అర్ధం ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ పిటిషనర్‌కు చిత్తశుద్ది ఉండి ఉంటే గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాతైనా ఈ సమస్యపై హైకోర్టును ఆశ్రయించి ఉండవచ్చని కానీ ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదు కనుకనే ఇప్పుడు పిటిషన్‌ వేసి ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను అడ్డంపెట్టుకొని ఎన్నికలను అడ్డుకోవడానికి హైకోర్టు అనుమతించదని ధర్మాసనం స్పష్టం చేస్తూ కాంగ్రెస్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.  

అయితే పీబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 8 ఏళ్ళు గడిచినా ప్రభుత్వం ఇంతవరకు దానిని అమలుచేయకపోవడాన్ని కోర్టుధిక్కారంగానే పరిగణించవలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీస్ పంపింది.


Related Post