నేనే గెలిచాను: డోనాల్డ్ ట్రంప్‌

November 16, 2020


img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్‌ 306, డోనాల్డ్ ట్రంప్‌ 232 ఓట్లు మాత్రమే సాధించడంతో జో బైడెన్‌ గెలిచినట్లు అమెరికా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్‌ ఆదివారం  పోస్ట్ చేసిన ట్వీట్‌లో ‘అబద్దాలను ప్రసారం చేసే మీడియా దృష్టిలో జో బైడెన్‌ గెలిచారని, దానిని నేను అంగీకరించడం లేదని మెసేజ్ పెట్టారు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఈ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఎన్నికలలో అవకతవకలు జరిగాయనే ఈ అభిప్రాయం వివాదాస్పదమైంది’ అని ట్రంప్‌ సందేశాన్ని ట్విట్టర్‌ ఫ్లాగ్ చేసింది.)            

మళ్ళీ “ఈ ఎన్నికలలో ‘నేనే గెలిచానని’ సోమవారం ట్వీట్ చేశారు. (కానీ దీనిపై అధికారికవర్గాలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ ట్రంప్‌ సందేశాన్ని ట్విట్టర్‌ ఫ్లాగ్ చేసింది.)   


తనకు ఎదురేలేదని అహంభావంతో విర్రవీగే డోనాల్డ్ ట్రంప్‌ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. అయితే ట్రంప్‌ ధోరణి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నప్పటికీ గతంలో ఆయన అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడు కనుక ఏవిధంగా ప్రవర్తించినా, ఏవిధంగా మాట్లాడినా చెల్లేది. కానీ ఎన్నికలలో ఓడిపోయినా ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని ట్విట్టర్‌లో ఆయన పెడుతున్న సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన పెడుతున్న సందేశాలు తప్పని ట్విట్టర్‌ ఫ్లాగ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయన ధోరణి చూసి నవ్వుకొంటున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అమెరికా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన డోనాల్డ్ ట్రంప్‌ ఆ పదవిలో నుంచి హుందాగా తప్పుకోకుండా దేశానికి ఇంకా అప్రదిష్ట కల్పిస్తుండటం చాలా బాధాకరమే. ఇకనైనా ట్రంప్‌ వాస్తవాన్ని అంగీకరించి హుందాగా తప్పుకోకపోతే ఆయన ఇంకా నవ్వులపాలయ్యి చివరికి అవమానకరరీతిలో నిష్క్రమించవలసి రావచ్చు. 


Related Post