హైదరాబాద్‌లో మరో నెలరోజులు వానలే...

November 16, 2020


img

బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల కారణంగా గతనెలలో హైదరాబాద్‌ కురిసిన భారీ వర్షాలు ప్రజలకు కష్టాలు, కన్నీళ్ళు మిగిల్చాయి. మళ్ళీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల మబ్బులు ముసురుకొంటున్నందున మరో నెలా-రెండు నెలలవరకు హైదరాబాద్‌ వాసులపై వరాల చిరుజల్లులు కురుస్తూనే ఉండవచ్చు. ఈ చిరుజల్లులు అందరికీ ఆనందం కలిగించేవే కనుక ఎంత కురిస్తే అంతా మంచిది. 

ముందుగా వరద సాయం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.530 కోట్లు ‘నగదు’ను నగర ప్రజలపై కుమ్మరించింది. అయితే నగదు జల్లులు అక్కడక్కడ మాత్రమే కురవడం, అవి కూడా ఎంపికచేసిన ఇళ్లపైనే కురవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక మీ-సేవా ద్వారా వరదసాయం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. హైదరాబాద్‌లో శనివారం వరకు సుమారు 4 లక్షల మందికిపైగా ఒక్కో కుటుంబం రూ.10,000 చొప్పున అందుకొన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేవరకు మిగిలినవారు కూడా ఇంకా అందుకొంటూనే ఉంటారు. 

నగరంలోని పారిశుధ్య కార్మికులకు ఒకేసారి రూ.3,000 జీతం పెంపు, ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ, ఆర్టీసీ కార్మికుల జీతాలలో విధించిన కోతలు తిరిగి చెల్లించడం వంటి వరాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల మబ్బులలో నుంచి కురిసిన చిరుజల్లులుగానే భావించవచ్చు. 

రాష్ట్రంలో అన్ని జిల్లాలోను పారిశుధ్యకార్మికులు కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై పనిచేశారు. కానీ కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుధ్యకార్మికులకు మాత్రమే జీతాలు పెంచింది ప్రభుత్వం. అంటే అది ఎన్నికల వరమే అనుకోవలసి ఉంటుంది. 

ఆర్టీసీ సమ్మె సమయంలో సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల ఎంత కటినంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. సుమారు 39 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా చలించలేదు. ఆర్టీసీని మూసివేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకొంటానని, తాను బ్రతికి ఉన్నంతవరకు ఆర్టీసీని కాపాడుకొంటానని చెప్పారు. బహుశః ఇది కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావమే అయ్యుండవచ్చు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక అంతవరకు హైదరాబాద్‌ నగరప్రజలపై ఇలా వరాల చిరుజల్లులు కురుస్తూనే ఉంటాయి. దానిలో వారు ఆనందంగా తడిసి ముద్దవ్వాల్సిందే! అదేవిధంగా సిఎంకేసీఆర్ కూడా పాలాభిషేకాలలో తడిసిముద్దవ్వాల్సిందే! 


Related Post