పాక్‌ దుశ్చర్యకు భారత్‌ ధీటుగా ప్రతీకారం

November 14, 2020


img

చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు ఎప్పుడూ పక్కలో బల్లెం లేదా పాముల్లాగే ఉంటూ సమయం చిక్కినప్పుడల్లా సవాళ్ళు విసురుతూనే ఉన్నాయి...కవ్విస్తూనే ఉన్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖా వెంబడి గురేజ్-యూరీ సెక్టర్ల మద్య ఉన్న సరిహద్దు గ్రామాలపై పాక్‌ సైనికులు శుక్రవారం మధ్యాహ్నం హటాత్తుగా మోర్టార్లతో దాడులు చేశారు. ఆ దాడిలో నలుగురు జవాన్లు, సరిహద్దు భద్రతాదళానికి చెందిన ఒక ఎస్సై, ఆరుగురు పౌరులు చనిపోయారు. ఇంకా అనేకమంది పౌరులు గాయపడ్డారు. 

పాక్‌ దుశ్చర్యకు భారత్‌ సైనికులు వెంటనే శతుఘ్నులు, ట్యాంక్ గైడెడ్ క్షిపణులతో ఎదురుదాడి చేసి చాలా ధీటుగా బదులిచ్చారు. పాక్‌ ఆక్రమిత భూభాగంలోని ఉన్న కాంక్రీట్ బంకర్లను ధ్వంసం చేశారు. పటిష్టమైన కాంక్రీటుతో నిర్మించిన ఆ బంకర్లు కనుమూసి తెరిచేలోగా తునాతునకలైపోయాయి. వాటిలో నిలువ ఉంచిన అనేక ఆయుధాలు, పక్కనే శిబిరాలలో నిలువ ఉంచిన ఇందనం, ప్రేలుడు సామాగ్రి అన్ని కూడా భారత్‌ దాడిలో ధ్వంసం అయ్యాయి. భారత్‌ కూడా తుపాకులతోనే ఎదురుదాడి చేస్తుందని అనుకొన్న పాక్‌ సైనికులు ఏకంగా క్షిపణులతో దాడి చేస్తుండటంతో బంకర్లు, శిబిరాలను వదిలిపెట్టి ప్రాణభయంతో దూరంగా పరుగులు తీస్తున్న దృశ్యాలను భారత్‌ ఆర్మీ చిత్రీకరించింది. భారత్‌ ఎదురుదాడిలో బాంకర్లలో ఉన్న 8 మంది సైనికులు హతమయ్యినట్లు తెలుస్తోంది. పాక్‌కు చెందిన మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

భారత్‌తో చెలగాటం ఆడితే ఏమవుతుందో భారత్‌ సైనికులు పాకిస్థాన్‌కు బాగా అర్దమయ్యేలా చెప్పారు. కానీ కుక్క తోక వంకర అన్నట్లు పాక్‌, చైనాల తీరు ఎన్నటికీ మారదని అందరికీ తెలిసిందే. కనుక భారత్‌ ఇక్కడితో పాకిస్థాన్‌ను విడిచిపెడుతుందా లేక ఈసారి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుందా లేదా మళ్ళీ మరోసారి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి ఏవైనా చేస్తుందా? అనేది రాబోయే రోజులలో తెలుస్తుంది. 


Related Post