 
                                        బిహార్ శాసనసభ ఎన్నికలలో జేడీయూ-బిజెపి కూటమి గెలిచి మళ్ళీ అధికారం చేపట్టనున్నందున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఫగూ చౌహాన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజ్యాంగం ప్రకారం తన మంత్రివర్గాన్ని గత శాసనసభను కూడా రద్దు చేయవలసిందిగా కోరారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్, తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా నితీష్ కుమార్‌ను కోరారు. 
బిహార్ శాసనసభ ఎన్నికలలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు కేవలం 43 సీట్లు మాత్రమే రాగా, బిజెపికి 74 సీట్లు వచ్చాయి. దాంతో ఈసారి బిజెపి ముఖ్యమంత్రి పదవి తీసుకొంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ మళ్ళీ నితీష్ కుమార్‌కే ముఖ్యమంత్రి పదవి అప్పగించి, ఆయన మంత్రివర్గంలో మంత్రి పదవులతో సరిపెట్టుకోవాలని బిజెపి నిర్ణయించుకోవడం విశేషం. కనుక ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నేతలు ఆదివారం సిఎం నివాసంలో సమావేశమయ్యి నితీష్ కుమార్‌ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఆ తరువాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్దతను తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖ అందజేస్తారు. గవర్నర్ ఆహ్వానం మేరకు నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా ఎన్డీయే కూటమికి అదనంగా మరో 3 సీట్లు కలిపి మొత్తం 125 మాత్రమే వచ్చాయి. ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాకూటమికి 110 సీట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని మహాకూటమి ఎన్నికల సంఘానికి లేఖ వ్రాసింది. ఓట్ల లెక్కింపు సరిగ్గా జరిపితే తమకు మరో 7-8 స్థానాలు తప్పకుండా వస్తాయని వాదిస్తోంది. ఒకవేళ ఎన్నికల సంఘం అంగీకరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మహాకూటమి నేతలు చెపుతున్నారు. కనుక ఒకవేళ మళ్ళీ రీకౌంటింగ్ జరిగి మహాకూటమికి సీట్లు పెరిగితే అప్పుడు మజ్లీస్ పార్టీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. బిహార్ శాసనసభ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకొని బిహార్ రాజకీయాలలో తన ఉనికిని చాటుకొనేందుకు సిద్దపడుతోంది. ఒకవేళ అవసరమైతే మజ్లీస్ పార్టీ మహాకూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.