కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీ భేటీ

November 13, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో మంత్రులు, పార్టీ కార్యదర్శులతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి చర్చించిన తరువాత మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యి ఎన్నికల వ్యూహాలపై లోతుగా చర్చించారు. గతంలో మాదిరిగానే పొత్తులు పెట్టుకోకపోయినా రెండు పార్టీలు పరస్పర అవగాహన, సమన్వయంతో పనిచేయాలని ఇరువురూ నిర్ణయించారు. కాంగ్రెస్‌, బిజెపిలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. 

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయిన పరస్పరం సహకరించుకొంటూ మంచి సమన్వయంతో పనిచేసి అద్భుతమైన ఫలితాలు సాధించాయి. మజ్లీస్ ప్రాధాన్యతను సిఎం కేసీఆర్‌ సరిగ్గా గుర్తించినందునే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ఆ తరువాత కూడా ఆ పార్టీతో ఇచ్చిపుచ్చుకొనే వైఖరితో ముందుకు సాగుతున్నారు. అందుకే గత ఆరేళ్ళుగా హైదరాబాద్‌ నగరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. తత్ఫలితంగా నగరానికి భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. నగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లీస్ ప్రాధాన్యతను సరిగ్గానే గుర్తించింది కానీ సిఎం కేసీఆర్‌లాగ మజ్లీస్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో విఫలమైంది.


Related Post