దుబ్బాక ఓటమి... కాంగ్రెస్‌ జాబితాలో మరోటి అంతే

November 12, 2020


img

సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి, కాంగ్రెస్‌ 3వ స్థానానికి పరిమితం కావడంపై నిశితంగా విశ్లేషించి చూస్తే ఆ మూడు పార్టీలపై ఎంతో కొంత ఆ ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. 

తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీకి ఓటములు సర్వసాధారణమైపోయాయని చెప్పక తప్పదు. ఆ పెద్ద జాబితాలో దుబ్బాక ఓటమి కూడా చేరింది. అంతే! రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి పార్టీలో అందరికీ తెలుసు. అందరూ దాని గురించి మాట్లాడుతుంటారు కూడా. కానీ పార్టీ నాయకత్వం, పార్టీ ఆలోచనా తీరు, వ్యవహార శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోకుండా ఇంకా మూస ధోరణిలోనే గుడ్డిగా ముందుకుసాగిపోతుంటారు. అదే విచిత్రం. 

కాంగ్రెస్‌ నేతలకు పార్టీ పదవులపై ఉన్న శ్రద్ద పార్టీని కాపాడుకొని గెలిపించుకోవడంపై లేకపోవడం కూడా ఈ దుస్థితికి ఓ కారణమని చెప్పక తప్పదు. కానీ అసలు పార్టీయే లేకుండాపోతే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ నేతలు ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. 

కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితికి దాని అధిష్టానం కూడా బాధ్యత వహించక తప్పదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయి చాలకాలమే అయినప్పటికీ ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించకపోవడాన్ని గమనిస్తే  కాంగ్రెస్‌ అధిష్టానానికి రాష్ట్ర కాంగ్రెస్‌ గురించి ఆలోచించేందుకు సమయం, ఆసక్తి రెండూ లేవని అర్ధమవుతోంది. అయినా జాతీయస్థాయిలోనే నాయకత్వ సమస్యను పరిష్కరించుకోలేక ఆగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నప్పుడు ఇక రాష్ట్ర కాంగ్రెస్‌ను ఎందుకు పట్టించుకొంటుంది? రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని విమర్శిస్తూ కాలక్షేపం చేయడమే రాజకీయ ప్రక్రియ అనుకొంటున్నారు తప్ప పార్టీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నట్లు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడానికి ఇదీ ఓ బలమైన కారణమనే చెప్పవచ్చు.   

దుబ్బాకలో గెలిచేందుకు టిఆర్ఎస్‌ నుంచి ‘చెరుకు’ను దిగుమతి చేసుకొన్నా అది చేదుగా మిగిలింది. అసలు దుబ్బాకలో కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్య జరుగవలసిన పోరును బిజెపి హైజాక్ చేసి టిఆర్ఎస్‌-బిజెపిపోరుగా మార్చేసినప్పుడే కాంగ్రెస్‌ ఓటమి ఖాయం అయిపోయింది. ఆవిధంగా ఎందుకు జరిగిందో కాంగ్రెస్‌ నేతలు తప్పక ఆలోచించుకోవాలి లేకుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా మళ్ళీ అదేవిదంగా జరిగే అవకాశం ఉంటుంది. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటములు అలవాటుగా మారిపోయాయి కనుక దుబ్బాక ఓటమి దానిపై ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మళ్ళీ యధాప్రకారం పోటీ చేయడం ఖాయం. అలాగే ఆ ఎన్నికలలో కూడా ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. 


Related Post