దుబ్బాక గెలుపు బిజెపికి టానిక్ వంటిదే కానీ...

November 12, 2020


img

సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి, కాంగ్రెస్‌ 3వ స్థానానికి పరిమితం కావడంపై నిశితంగా విశ్లేషించి చూస్తే ఆ మూడు పార్టీలపై ఎంతో కొంత ఆ ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. 

దుబ్బాకలో గెలుపు ఖచ్చితంగా బిజెపికి గొప్ప టానిక్ వంటిదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇది గొప్ప విజయం. ఆయన నాయకత్వంలో టిఆర్ఎస్‌ను బిజెపి ధీటుగా ఎదుర్కోవడమే కాక టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగగలదనే నమ్మకం బిజెపి శ్రేణులలో కల్పించిందని చెప్పవచ్చు. అలాగే ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో అగమ్యం గోచరంగా ముందుకు సాగి బోర్లాపడుతున్న బిజెపికి ఇప్పుడు టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో బాగా తెలిసివచ్చింది. అయితే దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో గెలవడం ఘనవిజయం కాదనే సంగతి ఆ పార్టీ నేతలకు ఇప్పటికే అర్ధమయ్యుంటుంది. అలాగే టిఆర్ఎస్‌ను ఓడించాలంటే ఎంతగా చెమటోడ్చాలో బిజెపి నేతలకి ఇప్పుడు బాగానే అర్ధమయ్యే ఉంటుంది. ఒక నియోజకవర్గంలో గెలుపుకి, 24 శాసనసభ నియోజకవర్గాలు కలిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు చాలా తేడా ఉందనే సంగతి వారికీ తెలుసు. కనుక మినీ శాసనసభ ఎన్నికల వంటి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మరింత పకడ్బందీ వ్యూహాలతో టిఆర్ఎస్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. బిజెపికి అంత శక్తి, క్యాడర్, బలమైన అభ్యర్ధులు ఉన్నారా లేరా అనేది జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనే తెలుస్తుంది. 


Related Post