రేవంత్‌ రెడ్డి, విహెచ్ బహిరంగంగా పరస్పర విమర్శలు

November 12, 2020


img

కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏమిటంటే అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎన్నికలలో గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీలో నేతలు ఎప్పుడూ పదవుల కోసం కీచులాడుకొంటూనే ఉంటారు. దుబ్బాక ఉపఎన్నికలలో ఘోరపరాజయంపై లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవలసిన ఈ తరుణంలో పిసిసి అధ్యక్ష పదవి కోసం బహిరంగంగా కీచులాడుకోవడమే అందుకు తాజా ఉదాహరణ. 

నిన్న ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క నేతృత్వంలో ‘రైతు పొలికేక’ పేరిట జరిగిన సభలో ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుల మద్య బహిరంగంగానే మాటల యుద్ధం జరిగింది. సభలో మాట్లాడిన వి.హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీనవర్గాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, పార్టీలో ఎప్పుడూ ఒక వర్గానికి చెందిన నేతలకే పదవులు లభిస్తున్నాయన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు లభిస్తున్నాయన్నారు. కనుక ఇకనైనా పిసిసి అధ్యక్ష పదవిని బడుగు బలహీనవర్గాలకు ఇవ్వాలని అన్నారు. బయట నుంచి వచ్చినవారికి పదవులు, టికెట్లు ఇవ్వడం సరికాదని చిరకాలంగా పార్టీని నమ్ముకొన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 

దాంతో సభలో ఉన్న రేవంత్‌ రెడ్డి అనుచరులు వి.హనుమంతరావు మాటలకు అడ్డుతగులుతూ ‘రేవంత్‌ రెడ్డి జిందాబాద్...’ అంటూ నినాదాలు చేసారు.  తరువాత మాట్లాడిన రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “పార్టీలో ఎప్పుడు చేరామనేది ముఖ్యం కాదు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు అమ్ముడుపోయినవారిని గుర్తించి ఏరిపడేయాలి. ఎన్నికలలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని నాయకులు ప్రస్తుతం పార్టీలో పెత్తనం చేస్తున్నారు. ఈ మాట మన అధిష్టానమే అంది,” అని ఘాటుగా జవాబిచ్చారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయి చాలకాలమే అయినప్పటికీ అధిష్టానం ఇంకా ఆయననే కొనసాగిస్తోంది. కనుక ఏదో రోజు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం తధ్యం కనుక ఆ పదవిని ఆశిస్తున్న వి.హనుమంతరావు, అది రేవంత్‌ రెడ్డికే దక్కే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించి ఈవిధంగా అక్కసు వెళ్ళగ్రక్కారనుకోవచ్చు. అయితే ఇతర పార్టీలు యువనాయకత్వంలో దూసుకుపోతుంటే రాజకీయాల నుంచి తప్పుకోవలసిన వయసులో వి.హనుమంతరావు వంటి వృద్ధులు పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకోవడం సరికాదు. ఆయన నిజంగా పార్టీ శ్రేయోభిలాషి అయితే ఇటువంటి గొంతెమ్మ కోరికలు కోరకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నవారికి అన్ని విధాలా సహకరిస్తే చాలా హుందాగా ఉంటుంది. ఆయన ప్రతిష్ట ఇనుమడిస్తుంది. కాదని యువనేతలతో పదవుల కోసం పోటీ పడితే చాలా అవమానకరంగా నిష్క్రమించవలసిరావచ్చు.


Related Post