సాదాబైనామాలకు హైకోర్టు బ్రేక్

November 11, 2020


img

సాదాబైనామాల క్రమబద్దీకరణకు హైకోర్టు బ్రేక్ వేసింది. వాటి క్రమబద్దీకరణపై ఇవాళ్ళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు వెలువరిచేవరకు సాదాబైనామాలను క్రమబద్దీకరించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టం రద్దయి, దాని స్థానంలో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత, ఇంకా పాత చట్టం ప్రకారం ప్రభుత్వం ఏవిధంగా సాదాబైనామాల క్రమబద్దీకరణ చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. 

ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అక్టోబర్ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, అక్టోబర్ 29 నుంచి నవంబర్‌ 10 వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని హైకోర్టుకు తెలియజేశారు.

దీనిపై హైకోర్టు స్పందిస్తూ, అక్టోబర్ 29 వరకు వచ్చిన దరఖాస్తులనే క్రమబద్దీకరణకు అనుమతించాలని, ఆ తరువాత వచ్చిన 6,74,201 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక నుంచి సాదాబైనామాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై 2 వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

చట్టప్రకారం హైకోర్టు నిర్ణయం సరైనదే కానీ సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన 6,74,201 లక్షల మంది రైతులకు ఇక ఎన్నటికీ న్యాయం జరిగే అవకాశం ఉండదు. సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను అమ్మినవారు మళ్ళీ వెనక్కు తీసుకొనేందుకు ప్రయత్నిస్తే రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ప్రభుత్వం, న్యాయస్థానమే ఈ సమస్యకు ఏదో ఓ పరిష్కారం తప్పక చూపవలసి ఉంటుంది. 


Related Post