కాంగ్రెస్‌ను బలహీనపరిచి టిఆర్ఎస్‌ తప్పు చేసిందా?

November 11, 2020


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేతలను, ఎమ్మెల్యేలను పార్టీలోకి ఫిరాయింపజేసుకొంది. ఊహించినట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి తన మనుగడ కోసం పోరాడుతోంది. 

రాష్ట్రంలో బిజెపికి బలం లేదు కనుక కాంగ్రెస్‌ను బలహీనపరిస్తే టిఆర్ఎస్‌కు ఇక ఎదురే ఉండదనే ఆలోచన బాగానే ఉంది. కానీ కాంగ్రెస్‌ను బలహీనపరిస్తే దాని స్థానంలోకి బిజెపి ప్రవేశిస్తుందని టిఆర్ఎస్‌ ఊహించలేదు. ఇప్పటివరకు ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్యనే ప్రధానంగా పోటీ ఉండేది. కానీ దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌  బిజెపితో పోరాడి ఓడింది. అంటే కాంగ్రెస్‌ను బలహీనపరిచి అంతకంటే శక్తివంతమైన శత్రువును టిఆర్ఎస్‌ చేజేతులా తెచ్చిపెట్టుకొన్నట్లయింది. 

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు కనుక రాష్ట్రంలో దానిని ఎదుర్కోవడం టిఆర్ఎస్‌కు పెద్ద కష్టమేమీ కాదు.  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇటువంటి ఉపఎన్నికలలో ఒకటి రెండు సీట్లు గెలుచుకొన్నప్పటికీ టిఆర్ఎస్‌కు ఎటువంటి నష్టమూ ఉండేది కాదు. కానీ దానిని ముందే బలహీనపరచడం వలన రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్న బిజెపికి చేజేతులా ఆ అవకాశం కల్పించినట్లయింది. లోక్‌సభ ఎన్నికలలో 4 సీట్లు సాధించడంతో గట్టిగా కష్టపడితే రాష్ట్రంలో మళ్ళీ బలపడవచ్చనే భావన బిజెపికి బలంగా కలిగింది. దాని భావన నిజమేనని దుబ్బాక ఉపఎన్నికలలో విజయం సాధించడంతో రుజువయ్యింది. రాష్ట్రంలో తిరుగేలేదనుకొన్న టిఆర్ఎస్‌ను దాని సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ఓడించడంతో రాష్ట్ర బిజెపి నేతలు, కార్యకర్తలలో నూతనోత్సాహాం మొదలైంది. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే వారి భావన లేదా నమ్మకాలకు ఈ విజయంతో బలం చేకూర్చినట్లయింది. దుబ్బాక ఉపఎన్నికలలో ఏవిధంగా కలిసికట్టుగా పనిచేసి టిఆర్ఎస్‌ను ఓడించామో అదేవిధంగా త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా విజయం సాధించగలమని బిజెపి నేతలలో నమ్మకం కలిగింది...పెరిగింది. అయితే అది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేము కానీ బిజెపి ఆశలు చిగురించేలా చేసిన క్రెడిట్ ఖచ్చితంగా టిఆర్ఎస్‌కే దక్కుతుంది.


Related Post