7.jpg) 
                                        దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి నాలుగు రౌండ్లలో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు 13,055 ఓట్లు పడగా, టిఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు 10,371 ఓట్లు పడటంతో 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి రఘునందన్ రావు 2,648 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌తో పోటీ పడే కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలలో 3వ స్థానంలో నిలుస్తుండటం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో మంచి పట్టున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించుకొన్నారు కానీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. కానీ టిఆర్ఎస్‌కు ఎంతో నష్టం చేసినట్లు కనబడుతోంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో ఆయనకు కేవలం 2,158 మాత్రమే పడ్డాయి.
దుబ్బాక ఉపఎన్నికలలో చాలా అవలీలగా భారీ మెజార్టీతో గెలుస్తుందని టిఆర్ఎస్ భావించింది. కానీ అనూహ్యంగా బిజెపి చాలా గట్టి పోటీనిచ్చింది. టిఆర్ఎస్‌లో గొప్ప ఎన్నికల వ్యూహ నిపుణుడిగా పేరొందిన మంత్రి హరీష్‌రావు దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవడంలో తడబడినట్లు కనబడ్డారంటే ఈసారి బిజెపి ఎంతగట్టి పోటీ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. సంక్షేమ పధకాలకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై మంత్రి హరీష్‌రావు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి, రాజీనామాకు సిద్దం అంటూ బిజెపి నేతలకు సవాళ్ళు విసిరారు. ‘జూటా నెంబర్ 1,2,3…9…’ అంటూ పెద్ద జాబితాను చదువుతూ బిజెపి నేతల అబద్దపు ప్రచారాలను ఖండించే ప్రయత్నం చేశారు. కానీ బిజెపి నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని గట్టిగా వాదిస్తూ ఓ వ్యూహం ప్రకారం టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే ముందుకు సాగిపోయారు.
ఈ ఉపఎన్నికలలో కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని టిఆర్ఎస్ మొదట్లో పదేపదే చెప్పింది. కానీ ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుబ్బాక ఉపఎన్నికల గురించి మాట్లాడుతూ ‘ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లే’ అని చెప్పడం టిఆర్ఎస్ ఓటమికి సిద్దపడి ఉందని సూచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మంత్రి హరీష్‌రావు వెర్సస్ బిజెపి నేతలు అన్నట్లు సాగిన ఈ ఉపఎన్నికలలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో మరి కొద్దిసేపటిలో తేలిపోతుంది.