రేపే కౌంటింగ్...సర్వం సిద్దం

November 09, 2020


img

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు రేపే వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు సిద్ధిపేటలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కేలెక్టర్ భారతి హోళీకేరి, సీపీ జోయల్ డేవీస్ ముగ్గురూ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. 

మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెడతారు. సుమారు అర్ధగంటలో అది పూర్తవగానే ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. దీని కోసం కౌంటింగ్ కేంద్రంలో 14 టేబిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతూ ఒక్కో రౌండ్ పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తుంటారు. బ్యాలెట్ ఓట్లతో పోలిస్తే ఈవీఎం ఓట్ల లెక్కింపు చాలా సులువు కనుక బహుశః ఉదయం 10-11 గంటలకు ఏ పార్టీ గెలువబోతోందో తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3-4 గంటలలోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దుబ్బాకలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత, బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావుల మద్యే పోటీ ప్రధానంగా జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వారిలో ఎవరో ఒకరు గెలుస్తారని సూచిస్తున్నాయి. ఒకవేళ టిఆర్ఎస్‌ అయితే ఎంత మెజార్టీతో గెలుస్తుందనేది చూడాలి. బిజెపి గెలిస్తే టిఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుంది. 

రేపే బిహార్‌ శాసనసభ ఫలితాలు కూడా వెలువడతాయి. అలాగే దేశంలో వివిద రాష్ట్రాలలో 54 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి. దుబ్బాక ఫలితాలు టిఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా కాగా, బిహార్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు బిజెపి, జేడీయూలకు ప్రతిష్టాత్మకంగా నిలువబోతున్నాయి.


Related Post